పవన్ ను దెబ్బతీయటమే కెసిఆర్ లక్ష్యమా?

Thursday, December 19, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి చురుగ్గా అడుగులు వేస్తోంది.  రాష్ట్రంలో తమ పార్టీ విస్తరణ కోసం సొంతంగా నమస్తే ఆంధ్ర ప్రదేశ్ పేరుతో ఒక పత్రికను కూడా ప్రారంభించాలని నిర్ణయించిన పార్టీ చేరికల మీద కూడా దృష్టి పెడుతోంది.  తాజాగా విజయవాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల మరికొందరు అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితిలో చేరారు.  తోట చంద్రశేఖర్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

మొత్తానికి భారాసలోకి నాయకుల వలసలు కూడా ప్రారంభం అయ్యాయి.  అయితే ఈ పార్టీ కూడా కేవలం కాపు సామాజిక వర్గం మీద మాత్రమే కాన్సెంట్రేట్ చేస్తుందా అనే అభిప్రాయం పలువురికి కలుగుతుంది.  దానితోపాటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలహీన పరచడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారా అని అభిప్రాయం కూడా పలువురిలో ఏర్పడుతుంది.  ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీకి కాపు సామాజిక వర్గంలో అనల్పమైన మద్దతు ఉంటుంది. ఆ వర్గానికి చెందిన కొందరు ఇతర పార్టీలలో కూడా కొనసాగుతున్నప్పటికీ,  సామాజిక వర్గం సమూహంగా తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ను పరిగణిస్తూ ఉందన్నది నిజం. . ఈ నేపథ్యంలో ఆ కులాన్ని జనసేన నుంచి దూరం చేయడమే టార్గెట్గా కేసీఆర్ వ్యూహరచన సాగుతోందా అనిపిస్తోంది.  జనసేన పార్టీలో ఎంతో కీలకమైన నాయకుడు తోట చంద్రశేఖర్ ను..  ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఇలాంటి అనుమానాలు పలువురిలో కలిగాయి.  ఇప్పుడు ఆయన సారథ్యంలో కొత్తగా పార్టీలో చేరుతున్న వారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే.  అంటే ఇంచుమించుగా వారి ప్రభావం వలన పడే ఓట్లన్నీ జనసేనకు పవన్ కళ్యాణ్ కు దక్కేవే. ఇలాంటి పరిణామాలను గమనించినప్పుడే పవన్ ఫోకస్ తో  బిఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. 

 నిజానికి దేశమంతా తమ పార్టీని ఘనంగా విస్తరించాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.  ఏపీలో ఆయనవి తొలి అడుగులు మాత్రమే అని అనుకోవాల్సి ఉంటుంది.  మొట్టమొదటగా ఏపీ అధ్యక్షుడిని మాత్రమే ఆయన ప్రకటించారు.  మొదటగా ఏపీలో సొంత పత్రికను మాత్రమే తీసుకువస్తున్నారు.  ఇలా పార్టీకి సంబంధించిన అన్ని పనులు మొదట ఏపీలోనే ప్రారంభం అవుతున్నాయి.  అక్కడ చంద్రబాబు నాయుడు అవకాశాలకు గండి కొట్టడం కేసీఆర్ లక్ష్యం.  అయితే అందుకు పవన్ కళ్యాణ్ ను జనసేన ను బలహీనపరచడం ద్వారా ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టుగా ఉంది. ఈ డొంకతిరుగుడు ఎత్తుగడలతో  కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి.  ఇప్పుడు తీయటి పలుకులు పలికినంత మాత్రాన,  ఒక కొత్త పత్రిక పెట్టి తమ సొంత బాకా ఊదుకున్నంత మాత్రాన ఏపీలోని తెలుగు ప్రజలు..  రాష్ట్ర విభజన గాయాన్ని మరిచిపోయి కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటారా అనేది వేచి చూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles