నామినేషన్ వేయాలంటే శ్మశానం గోడదూకి వెళ్లాలా?

Thursday, December 19, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పోలీసులను ఎంత అరాచకంగా వాడుకుంటున్నారో.. ప్రజాస్వామిక విలువలను, పద్ధతులను ఏ రకంగా తుంగలో తొక్కేస్తున్నారో తెలియజెప్పే సంఘటనలు గురువారం నాడు చోటు చేసుకున్నాయి.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మద్దతుతో గెలవాలని కోరుకోవాలి గానీ.. అసలు ప్రతిపక్షం అనేది ఉండనే కూడదని, రూపుమాసిపోవాలని, వారు నామినేషన్లు కూడా వేయకుండా చేయాలని కుత్సితమైన పనులకు దిగజారడం వైసీపీకి మాత్రమే చెల్లింది. అధికారులు, పోలీసులు అధికార పార్టీ ఒత్తిడికే గురవుతున్నారో.. లేదా, వారి భజన చేయడానికి తెగబడుతున్నారో తెలియదు గానీ.. ఈ రాజకీయ క్రీడలో భాగం అవుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం సందర్భంగా.. అనేక చిన్నెలు చోటు చేసుకున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లను ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ భావించింది. ఏకగ్రీవం అంటే వారికి తెలిసిన నిర్వచనం ఒక్కటే.. ప్రతిపక్ష పార్టీలు అసలు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, నిలువరించడం! ఇందుకు గురువారం కూడా ప్రయత్నాలు జరిగాయి.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు నామినేషన్లు వేయడానికి వస్తోంటే.. వారి మీద దాడులు చేయడం, కొట్టడం, కిడ్నాప్ చేయడం వంటి అనేక దురాగతాలకు అధికార పార్టీ పాల్పడిన సంగతి ప్రజలందిరికీ గుర్తుండే ఉంటుంది. పలుచోట్ల దాడులతో వైసీపీ దళాలు అప్పట్లో రెచ్చిపోయాయి. ఈ దఫా కూడా అలాంటి మ్యాజికల్ దాడులను రిపీట్ చేయాలని వైసీపీ అనుకుంది. కానీ తెలుగుదేశం కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఏకగ్రీవం కాకుండా అడ్డుకుంది.
దారుణం ఏంటంటే.. అనంతపురంలో జేసీ కుటుంబ అనుచరుడు వేలూరు రంగయ్య ఎమ్మెల్సీగా నామినేషన్ వేయాలని అనుకున్నారు. అయితే ఆయన నామినేషన్ నే అడ్డుకోవాలని అనుకున్న వైసీపీ దళాలు అక్కడ మోహరించాయి. తెలుగుదేశం అభ్యర్థి రంగయ్యను వైసీపీ వారు కిడ్నాప్ చేస్తారనే ప్రచారం సాగింది.
నాటకీయ పరిణామాల మధ్య జేసీ అనుచరుడు శ్రీకాంత్, రంగయ్య ఇద్దరూ కలెక్టరేట్ వెనుకవైపున ఉన్న శ్మశాన వాటిక గోడదూకి లోపలకు ప్రవేశించారు. వెనుకనుంచి కార్యాలయంలోకి వెళ్లారు. ఈలోగా రంగయ్యను ప్రతిపాదించే వారంతా బైకులపై కలెక్టరేట్ కు చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడి, సద్దుమణిగింది.
చిత్తూరులో ఇంకో డ్రామా జరిగింది. తెదేపా నామినేషన్ పడకుండా ఉండడానికి ఎమ్మెల్యేలు పలువురు మోహరించి వేచి చూశారు. ఈలోగా స్వతంత్ర అభ్యర్థిగా ధనుంజయ యాదవ్ నామినేషన్ వేయడానికి టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుతో కలిసి వచ్చారు. లోనికి వెళితే.. నామినేషన్ కు గడువు ముగిసిపోయిందని అధికార్లు చెప్పారు. అప్పటికింకా అరగంట సమయం మిగిలి ఉందని వారు వాదులాడి నామినేషన్ వేశారు. అభ్యర్థిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేస్తారనే భయంతో.. వారు జిల్లా ఎస్పీకి ఫోను చేసి.. పోలీసు రక్షణ తెప్పించుకుని, పోలీసు వాహనంలోనే తిరిగి భద్రంగా వెనక్కు వెళ్లారు.
ప్రజాస్వామ్యంలో నామినేషన్లు వేయడానికే ఇంత దారుణంగా భయపడే పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles