పత్రిక పెడితే అంత ఈజీగా గెలిచిపోతారా?

Thursday, December 19, 2024

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలంగా సేవలు అందించడానికి ఒక కొత్త పత్రికను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఏపీలో త్వరలో నమస్తే ఆంధ్ర ప్రదేశ్ పేరుతో భారాస కొత్త పత్రికను ప్రారంభించబోతోంది.  తెలంగాణలో ‘నమస్తే తెలంగాణ’ పేరుతో  సొంత పత్రిక ని కలిగి ఉంటూ..  రాజకీయ మైలేజీకి ఆ పత్రికను విస్తారంగా వాడుకుంటూ భారాసఅడుగులు ముందుకు వేస్తోంది.  ఇదే వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని,  పత్రిక ద్వారా ప్రజల మనసులు  గెలుచుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.  అయితే ఒక పత్రిక పెట్టడం ద్వారా రాజకీయ మైలేజ్ సాధించడం ఎన్నికల్లో గెలవడం అంత ఈజీనా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.

 తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభించిన నేపథ్యమే వేరు.  అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో..  సీమాంధ్ర యాజమాన్యాల చేతిలో ఉన్న అగ్రపత్రికలలో తమ పోరాటానికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే ఉద్దేశంతో నమస్తే తెలంగాణ పత్రికను ప్రారంభించారు.  ఉద్యమ,  పోరాట అవసరాలకు ఈ పత్రిక చాలా బాగా ఉపయోగపడింది.  ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లడానికి రాజమార్గం లాగా ఏర్పడింది.  తదనంతర పరిణామాలలో భారాస అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా..  పత్రికను మాత్రం తమకు కీలక ప్రచారాస్త్రంగా కొనసాగిస్తూ వస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పత్రికలు పార్టీల పరంగా చేరిపోయాయి.  అగ్ర దినపత్రికలలో ఈనాడు,  ఆంధ్రజ్యోతి  తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుండగా..  సాక్షి సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక లాగా వ్యవహరిస్తూ ఉంటుంది.  మిగిలిన వాటిలో కూడా కొన్ని పత్రికలు పార్టీల అనుబంధాన్ని పెంచుకోలేకుండా ఉన్నాయి. . విశాలాంధ్ర ప్రజాశక్తి వంటి వామపక్ష పత్రికలను పక్కన పెడితే..  ఆంధ్రప్రభ లాంటివి అధికార పార్టీకి కొమ్ము కాస్తూ నడుస్తున్నాయి. 

 అయితే కేవలం పత్రిక ద్వారా ప్రచారం చేసుకోవడమే ఎన్నికలలో పార్టీలను గెలిపిస్తుందా అంటే అవును అనే సమాధానం మనం వినలేం.  ఒకపట్లో తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో అధికారంలోకి రావడానికి ఈనాడు దినపత్రిక ఉపయోగపడి ఉండవచ్చు.  అప్పట్లో సామాజిక వాతావరణం వేరు.  ప్రజల దృష్టిలో పత్రికలకు ఉన్న విశ్వసనీయత వేరు.   పత్రికలు ఏం రాసినా సరే నిజం చెబుతున్నాయని ప్రజలు అనుకునే పరిస్థితి.  ఇప్పుడు రోజులు మారిపోయాయి.  ఈనాడు ప్రభుత్వం మీద ఎన్ని నిందలు వేసినా సరే,  కావాలని పని కట్టుకుని అలా చేస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.  నిష్పాక్షిక కవరేజీ అని నమ్మలేకపోతున్నారు.  ఎందుకంటే పత్రికలు పార్టీల రంగు పులిమేసుకున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో  ఈ అగ్ర దినపత్రికలే తమ తమ పార్టీలను ఏకపక్షంగా అధికారంలోకి తీసుకు రాగలగడం అనేది కల్ల.  అలాంటప్పుడు కొత్తగా గులాబీ రంగు పూసుకుని మరొక పత్రిక వచ్చినంత మాత్రాన,  భారాస ఏపీలో అధికారంలోకి వచ్చేస్తుందా? అసాధ్యం.  

పత్రిక వ్యాపారం కూడా అంత సక్సెస్ ఫుల్ గా నడిచే అవకాశం లేదు.  దశాబ్దాలుగా ఉన్న పత్రికలే సర్కులేషన్ పడిపోయి కునారిల్లుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం అయినా,  పత్రికను వ్యాపారం లాగే చేయాలని అనుకున్నా..  ఈ దశలో కొత్త పత్రికకు పెద్ద భవిష్యత్తు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో భారాస తరఫున అన్ని ప్రాంతీయ భాషల్లోనూ పత్రికలు తేవాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి గానీ.. ఎంత మేర వర్కవుట్ అవుతుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles