కమలంలో సోము చాలా స్ట్రాంగ్ గురూ!

Friday, October 18, 2024

సోము వీర్రాజు ఇప్పటివరకూ తన రాజకీయ జీవితంలో.. తాను ప్రజాబలం ఉన్న నాయకుడిగా నిరూపించుకున్న ఉదంతం లేదు. సర్పంచిగా కూడా ఓడిపోయిన చరిత్ర ఆయనకు ఉంది. కానీ, భారతీయ జనతా పార్టీలో మాత్రం ఆయన హవా మామూలుగా లేదు. గతంలో కన్నా లక్ష్మీనారాయణను పార్టీ సారథిని చేసినప్పుడు.. సోము వీర్రాజు అలక పూనారు. పార్టీకి కొంతకాలం దూరంగా ఉన్నారు. అప్పుడు పార్టీ ఆయనను బతిమాలి బుజ్జగించి మరీ ట్రాక్ మీదకు తెచ్చింది. కన్నా తర్వాత సారథ్య బాధ్యతలను ఆయన చేతిలోనే పెట్టింది. అప్పటినుంచి రాష్ట్రంలో పార్టీని ఉద్ధరించడానికి సోము వీర్రాజు ఏం చేస్తున్నారన్నది మాత్రం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. విస్తరణ పరంగా, ఓటు బ్యాంకు పెంచుకునే పరంగా బిజెపి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉంది.
అయినా సరే బిజెపి సోము వీర్రాజునే నెత్తిన పెట్టుకోవడానికి చూస్తున్నదే తప్ప.. రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఏపీ బీజేపీలోని సీనియర్లు కొందరు పార్టీ పరిస్థితుల గురించి వివరించడానికి ఢిల్లీ వెళితే.. వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, మంత్రి మురళీధరన్ ను కలిస్తే.. ఆయన అంటీముట్టనట్టుగా వీరితో మాట్లాడారని వారు వాపోతున్నారు.
సోము వీర్రాజుకు రాష్ట్రపార్టీలో కొందరి అండదండలు ఉన్నాయి. అధిష్టానం వద్ద మాట్లాడగలిగే నేర్పు ఉన్న వారందరూ కూడా సోము భజన చేస్తుంటారు. సోము వీర్రాజు పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ కు తాకట్టు పెట్టేశారని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడడం అనేది పార్టీ మొత్తం మరచిపోయేలా చేస్తున్నారని సొంత పార్టీలోనే అనేక ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు తప్పు.. ప్రభుత్వం మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగలనని సోము వీర్రాజు ఎన్నడూ నిరూపించుకోలేదు.
గతంలో మోడీ విశాఖ వచ్చి రాష్ట్ర పార్టీ నాయకులతో భేటీ అయినప్పుడు.. సోము వీర్రాజు వైఫల్యాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని ప్రధాని మోడీ అడిగితే.. ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కనీసం సమాధానం చెప్పలేకపోయారు. తడబడి తప్పులు చెప్పారు. పక్కనుంచి ఇతర నాయకులు జిల్లాల సంఖ్యను సరిచేసి అందించాల్సి వచ్చింది. మోడీ నవ్వుకున్నారు. ఆయనకు ఆగ్రహం వచ్చి ఉంటుందని, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో కూడా తెలియని వ్యక్తి రాష్ట్ర సారధిగా ఏం పనికొస్తాడని భావిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటి నిర్ణయాలేమీ రాలేదు.
తీరా కన్నా వీర్రాజు సోము వైఖరితో విసిగి పార్టీని వీడిపోతున్నా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు సీనియర్లు కొందరు ఢిల్లీ వెళ్లి తమ అభిప్రాయాలు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. వారందరూ కూడా పక్కదారి చూసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హైకమాండ్ వద్ద సోము వీర్రాజు ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారారా అని పార్టీ నాయకులే విస్తుపోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles