తెలంగాణ గవర్నర్ గా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో వ్యవహరిస్తున్న డా. తమిళసై సౌందరరాజన్ అసంతృప్తికి కేసీఆర్ కన్నా బిజెపి అధిష్టాన వైఖరి కారణంగా స్పష్టం అవుతుంది. రాజ్యసభకు పంపి, తనను కేంద్ర మంత్రిగా చేయకుండా రాజకీయంగా మౌనంగా ఉండవలసిన రాజ్ భవన్ కు పంపడం పట్ల ఆమె తట్టుకోలేకపోతున్నారనే అభిప్రాయం కలుగుతుంది.
తాజాగా, తమిళనాడులో ఓ సభలో ప్రసంగిస్తూ ఆమె చేసిన వాఖ్యలే ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తనలాంటి ప్రతిభావంతులను తమిళ ప్రజలు గుర్తించడం లేదని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై వాపోయారు. తమ ప్రతిభను తమిళ ప్రజలు గుర్తించి ఉంటే.. ఎంపీలుగా గెలిచి కేంద్రమంత్రులుగా ఉండే వాళ్లమని, పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడి ఉండే వాళ్లమని ఆమె పేర్కొనడం గమనార్హం.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ, రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో అర్ధాంతరంగా గవర్నర్ గా పంపడం పట్ల ఆమె రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్ కు `సమాధి’ పడినట్లుగా భావిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. అయితే, బీజేపీ నాయకత్వానికి కోపం రాకుండా ఉండడం కోసమై దయతలచి తనకు గవర్నర్ పదవి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
కోయంబత్తూరులోని పీళమేడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘నా లాంటి ప్రతిభావంతులకు తమిళనాట గుర్తించకపోయినా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మా సత్తాను తెలుసుకుని గవర్నర్ పదవినిచ్చింది’’ అని ఆమె చెప్పారు. పైగా, తాను ప్రజల కోసం కష్టపడి సేవలందిస్తుంటే వార్తలుగా రావడం లేదని, కానీ ఆదివారం మహాబలిపురం కార్యక్రమంలో జారిపడితే వెంటనే అదో పెద్ద వార్తగా మారిందని అంటూ మీడియాపై కూడా ఆమె విరుచుకు పడ్డారు.
ప్రత్యక్ష ఎన్నికలలో ఒకసారి కూడా గెలుపొందలేక పోవడంతో ఆమె రాజ్యసభ సభ్యత్వం ఆశించారు. తద్వారా కేంద్ర మంత్రివర్గంలో చేరాలనుకున్నారు. కానీ ఇంతలో గవర్నర్ గా పంపి, తనకన్నా జూనియర్లైన వారిని తన స్థానంలో రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడమే కాకుండా, వారిలో ఒకరిని కేంద్ర మంత్రిగా చేశారు. ఇటీవలనే పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి అణ్ణామలైని ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి, అతనిని ఏకంగా కర్ణాటక ఎన్నికలలో పార్టీ సహా ఇన్ ఛార్జ్ గా నియమించారు.
తెలంగాణకు గవర్నర్ గా మొదట్లో బాగానే అధికారిక హోదాలో వ్యవహరించినా, తర్వాత సీఎం కేసీఆర్ కు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి దూరం పెరుగుతూ రావడంతో ఆమె పరిస్థితి ఇరకాటంలో పడినట్లయింది. మోదీ ప్రభుత్వం పట్ల తన `అనుబంధం’ను ఎప్పటికప్పుడు ప్రదర్శించుకొనే పోటీలో పడటంతో వివాదాలకు కేంద్రబిందువుగా మారారు.
సమయం, సందర్భం లేకుండా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తడం, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం ద్వారా నిత్యం వార్తలలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెసేతర ప్రభుత్వాలున్న పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల మాదిరిగా కాకూండా కేసీఆర్ స్టయిల్ భిన్నంగా ఉండడంతో, గవర్నర్ ఉనికినే గుర్తించనట్లు వ్యవహరిస్తూ ఆమెను తీవ్ర అసహనంకు గురి చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహితం నిస్సహాయంగా వ్యవహరిస్తూ ఉండడంతో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో డా. తమిళసైకు అర్థం కావడం లేదు.