వాళ్లు వాడుతున్నారా.. వీళ్లు ఎగబడుతున్నారా?

Saturday, November 16, 2024

యూనివర్సిటీ వీసీ స్థాయిలో ఉండే వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థికి అనుకూలంగా సభలు పెట్టి మరీ ప్రచారం చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆ పదవికి అసలు గౌరవం మిగులుతుందా?
విద్యాశాఖలో ఆర్జేడీ స్థాయిలో ఉండే ఉన్నతాధికారి.. జిల్లాల్లో తిరిగి క్యాంపులు నిర్వహిస్తూ.. అందరినీ పోగేసి అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లువేయాలని అడుగుతూ ఉంటే.. ఎంత అసహ్యంగా ఉంటుంది?
ఇలాంటి లేకిపనులు, ఈ స్థాయి అధికార్లకు తప్పు అని అనిపిస్తున్నట్టు లేదు. యథేచ్ఛగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించడం కోసం వీరు తమ శక్తియుక్తులను ఒడ్డుతున్నారు. విశాఖపట్టణంలోని ఆంధ్రయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎమ్మెల్సీ ప్రచార సభలో పాల్గొనడం అనేది ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. అలాగే విద్యాశాఖ ఆర్జేడీ.. అదే పనిచేస్తూ వామపక్ష నాయకులకు అడ్డంగా దొరికిపోయారు. సదరు అధికార్లకు ఉన్న నైతికత గురించి ఎర్ర పార్టీల నేతలు ఇప్పుడు తూర్పారపడుతున్నారు.
అయితే వీసీ స్థాయిలోని ఉన్నత పదవిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ అండదండలతో మాత్రమే సాధ్యం అవుతుందని అందరికీ తెలుసు. అంటే వారు పాలకపక్షం పెద్దలకు సన్నిహితులై ఉంటారు. ఇప్పుడిలా బహిరంగంగా తమ పార్టీ అనుబంధాన్ని ప్రదర్శించుకుంటూ ఆ పార్టీ జెండా భుజాన మోస్తూ తిరగాలనుకోవడమే చిత్రంగా కనిపిస్తోంది.
ఒక రకంగా చూసినప్పుడు.. స్వామిని మించిన స్వామి భక్తి ప్రదర్శిస్తున్న ఇలాంటి వాళ్లందరూ నిజానికి పార్టీ పరువునే తీస్తుంటారు. అధికార పార్టీ అనైతిక మార్గాల్లో తమ పార్టీకి ఊడిగం చేసేవారికే రాజ్యాంగబద్ధ పదవులు కట్టబెడుతోందని విమర్శలు పుట్టడానికి ఆస్కారం ఇస్తున్నారు. అధికార్లను కూడా పార్టీ ప్రచారానికి అడ్డగోలుగా వాడుతున్నారనే ఆరోపణలు రావడానికి అవకాశం ఇస్తున్నారు. ఇలాంటి పనులన్నీ ప్రభుత్వం పరువు తీసేవే.
అసలు.. వీసీ స్థాయిలో నియమించిన వ్యక్తినుంచి, ఆర్జేడీ లాంటి అధికారి నుంచి పాలకపక్షం ఎన్నికల ప్రచారాన్ని ఆశిస్తుందా? అనేది ఒక సందేహం. ఎందుకంటే ఎన్నికల్లో నెగ్గడానికి పార్టీకి వారి మార్గాలు వారికి ఉంటాయి. ఆశ్రితులు గనుక వీరికి పదవులు ఇస్తారే తప్ప.. మళ్లీ వీళ్లనుంచి ప్రచారం వంటి పనులు ఆశించరు. అధికారుల విషయంలోనైనా అంతే. అయితే.. పాలకపక్షం వాడుకోకపోయినా సరే.. వీసీ, ఆర్జేడీ లాంటి అనేకమంది అధికారులు అత్యుత్సాహంతో ఎగబడి ప్రచారం చేస్తుండడం జరుగుతోంది. ఈ పదవులు పోయిన తరువాత, పదవీ విరమణ తర్వాత.. రాజకీయాల్లోకి వచ్చి అధికారం అనుభవించాలనే సుదూర కాంక్షతోనే ఇలాంటి వారు అదికార పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles