ఏపీ రాజకీయాలలో కన్నా లక్ష్మీనారాయణ విలక్షణమైన నేత. ఎప్పటికప్పుడు ఎవ్వరో ఒకరి అండతో కీలక పదవులు కైవసం చేసుకోవడం ఆయనకే చెల్లుబాటు అవుతుంది. పక్కనున్న వారికి సహితం తెలియకుండా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలపడంలో కూడా ఆయన సామర్థ్యం అసమానం. సుమారు ఐదు దశాబ్దాల ప్రజా జీవనంలో రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించిన వారితోనే ఆ తర్వాత చేతులు కలుపుతూ వచ్చారు.
గుంటూరులో ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షునిగా రాజకీయ జీవనం ప్రారంభించి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గంకు ప్రయత్రిగా ఉంటూ, నేటికీ అదేవిధంగా కొనసాగుతున్నారు. బహుశా ఆయన రాజకీయ జీవనంలో చేతులు కలపని రాజకీయ ప్రత్యర్థి ఆయన ఒక్కరే కావచ్చు.
ఈ సమయంలో ఢిల్లీ రాజకీయాలలో రాయపాటికి ప్రత్యర్థిగా ఉంటున్న మరో ఎంపీ కావూరు సాంబశివరావుతో చేతులు కలిపి, ఆయన మద్దతుతో 1989లో పెదకూరపాడు ఎమ్యెల్యే సీట్ సంపాదించి, మొదటిసారి రాష్ట్ర శాసనసభలో ప్రవేశించారు. వాస్తవానికి అక్కడ ఓటమి తప్పదని భావించి, పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ రోజున టిడిపి వారు అక్రమాలకు పాల్పడ్డారని అంటూ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసనలు చేపట్టారు.
ఎమ్యెలేగా మొదటగా నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు దగ్గరై మంత్రి పదవి సంపాదించారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి సహితం దగ్గరగా ఉంటూ మంత్రివర్గంలో కొనసాగారు. వీరిద్దరి కారణంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గానికి జిల్లాలో బద్ద రాజకీయ విరోధిగా ఉంటూ వచ్చారు.
జనార్దనరెడ్డికి సన్నిహితంగా ఉంటూనే రాజకీయంగా ఆయనకు బద్ద విరోధిగా ఉంటున్న ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డికి సహితం సన్నిహితంగా ఉండేవారు. ఇక, 2004 వచ్చే సరికి కాంగ్రెస్ కి రాజశేఖరరెడ్డి ఒక్కరే మిగిలిన బలమైన నేతగా గ్రహించి, ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుండే కెవిపి రామచంద్రరావుకు దగ్గరై, రాజశేఖరరెడ్డి ప్రాపకం సంపాదించారు.
2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మొదట్లో గుంటూరు జిల్లా నుండి ఏకైక మంత్రిగా ఉండగలిగారు. చివరకు రాజశేఖరెడ్డికి సన్నిహితుడైన కాసు వెంకట కృష్ణారెడ్డికి సహితం మంత్రివర్గంలో స్థానం లేకుండా కెవిపి ద్వారా చక్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా ఎవ్వరు ఉంటె వారికి దగ్గరై, కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారు.
2014 నాటికి కాంగ్రెస్ ప్రభావం తగ్గడం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అందరూ వైసీపీలో కీలక స్థానాలలో ఉంటూ ఉండడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, మూడో స్థానంలో డిపాజిట్ కోల్పోయారు. ఇక ఎన్నికలు కాగానే బీజేపీలో చేరారు. నాటి బీజేపీలో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడుగా ఉంటున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుకు తెలియకుండా ఆర్ఎస్ఎస్ నాయకులు, సోము వీర్రాజు అండదండలతో నేరుగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు.
ఎన్ ఎస్ యు ఐ నేతగా గుంటూరులో నాటి ఆర్ ఎస్ ఎస్ అధినేత సుదర్శన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కన్నా బీజేపీలో ఉంటూ ఆ సంస్థ నేతలకు సన్నిహితం అయ్యారు. అయితే, బీజేపీలోకి తనను తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించే సమయంలో, ఆయనకు వ్యతిరేకంగా వెంకయ్యనాయుడుతో చేరి రాష్ట్ర అధ్యక్ష పదవి పొందారు. అప్పటి నుండి వారిద్దరి మథ్య రాజకీయ వైరం ప్రారంభమైంది.
ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో బిజెపికి నోటాకన్నా తక్కువగా ఓట్లు రావడంతో పాటు ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించారు. అదే అదనుగా, సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు కలిసి పార్టీలో ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేస్తూ వచ్చారు. పైగా, రాజ్యసభ సీట్ ఆశించి భంగపడ్డారు.
బీజేపీ- టీడీపీ పొత్తు ఉంటె తాను తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశం ఉంటుందనుకున్న ఆయనకు అటువంటి అవకాశాలు కనిపించకపోవడంతో ఇప్పుడు పార్టీ మారక తప్పడం లేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కన్నా అంత తీవ్రంగా బహుశా మరే కాంగ్రెస్ నాయకుడు చంద్రబాబు నాయుడును దూషించి ఉండరు. ఇప్పుడు అదే నాయకుడి నాయకత్వం వైపు మొగ్గు చూపడం గమనార్హం.
జనసేనలో చేరదామని మొదట్లో మొగ్గు చూపినా, టిడిపితో ఆ పార్టీ పొత్తు ఖరారు కాకపోవడం, ఆ పార్టీలో చేరినా అధికారంలోకి వస్తే ఇద్దరు, ముగ్గురికి మంత్రి పదవులు లభిస్తే తనదాకా రాకపోవచ్చని భావిస్తున్నారు. అందుకనే బలమైన కాపు నేతగా చంద్రబాబు అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి తప్పక ఇస్తారని భావిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.