హిందూత్వం అంటే జగన్‌కు అంత చులకనా?

Friday, December 5, 2025

క్రియేటివిటీ హద్దులు దాటేసరికి అసలు మొదటికే మోసం వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందువులు అందరికీ, రొటీన్ గా కాకుండా విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా తన ముద్ర ఏమిటో చూపించాలని ఆశించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఆయనను ఇప్పుడు విమర్శల పాలు చేస్తోంది! ‘హిందూ పండగలను అవమానించేలా గా ఈ కేథలిక్ క్రిస్టియన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుడుకుతనం ప్రదర్శించారు’ అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మీద విరుచుకుపడుతున్నారు. హిందూ దేవుళ్లను పండగలను చులకన చేసే లాగా జగన్ శుభాకాంక్షలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనవసరమైన ప్రయోగం చేసి, కొరివితో తల గోక్కున్నట్టుగా, జగన్ మతంతో పెట్టుకున్నారని ప్రజలు భావిస్తున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే..

మహాశివరాత్రి పర్వదినం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హిందువులు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజెప్పాలని వారు అనుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక చిత్రం గీయించారు. ఆ చిత్రంలో ఒక పురాతన దేవాలయం వెలుపల ఒక పసిపాప ఢమరుకాన్ని పోలిన బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ పాప చెంత కూర్చుని ఆమెకు జగన్మోహన్ రెడ్డి చెంబుతో పాలు తాగిస్తూ ఉంటారు. వారికి సమీపానే ఒక ఆవు (శివరాత్రి నాడు చెబుతున్న శుభాకాంక్షలు గనుక బహుశా దానిని ఎద్దు అని కూడా అనుకోవచ్చు) ఉంటుంది.
చెప్పుకోవడానికి బొమ్మ ఇంత మాత్రమే. కానీ హిందుత్వాన్ని అవమానించేలా దేవుడిని చులకన చేసేలా శివ భక్తులు అభ్యంతర పెట్టేలా ఇందులో అనేక అంశాలున్నాయి. అందుకే ఇప్పుడు చాలా పెద్ద వివాదంగా మారుతోంది. ఒక్కొక్కటిగా చూస్తే..
అన్నార్తుల ఆకలి తీర్చడమే అసలైన ఈశ్వరారాధన అని ఈ ట్వీట్ కు టైటిల్ పెట్టారు. సాధారణ పరిస్థితుల్లో ఈ మాట బాగానే ఉంటుంది కానీ.. శివరాత్రి పండుగ నాడు ఈ మాట చెప్పడం అభ్యంతరకరంగా ఉంది. గుడిలోకి వెళ్లి ఈశ్వరుడికి మీరు మొక్కవలసిన అవసరం లేదు, గుడి బయట ఉండే పేద వాళ్లకు కాసింత పాలు పోస్తే చాలు అని ముఖ్యమంత్రి జగన్ సందేశం ఇస్తున్నట్లుగా ఉంది. హిందూ ఆలయాలకు వెళ్లకుండా ప్రజలలో ఒక ఆలోచన కలిగించేలాంటి వాక్యం ఇది.
ఈ చిత్రంలో.. జగన్ పాలు తాగిస్తున్న పసిపాప చేతిలో ఢమరుకాన్ని ఉంచారు. సాక్షాత్తూ శివ స్వరూపానికి జగన్ ఔదార్యంతో పాలు తాగిస్తున్నట్లుగా ఈ బొమ్మ కనిపిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసిన బొమ్మలో ఆలయం మెట్ల మీద నుంచి పాలు వృథాగా కారిపోతున్నట్లుగా చిత్రించారు. అంటే ఆలయంలో శివుడికి అభిషేకాలు చేసే పాలు అలా వృధాగా పోతుంటాయని, శివుడికి అభిషేకం చేసే బదులుగా పేదవాళ్ళకి ఆకలితో అలమటిస్తున్న వాళ్లకి పాలు తాగించడం మంచిదని తెలియజేసేలాగా ఈ చిత్రంలోని భావం ఉంది. హిందూ దేవుళ్లకు పాలాభిషేకాలు చేసే సాంప్రదాయాన్ని ఎగతాళి చేస్తున్న, తప్పుపడుతున్న తీరుగా ఇది ఉంది. దీని పట్ల హిందువులలో తీవ్ర ఆవేశం వ్యక్తం అవుతుంది. భగవంతుడికి చేసే అభిషేకాలు దండగ అని చెప్పడానికి ఈ క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా హిందువుల మనోభావాలను కించపరుస్తూ రెచ్చిపోతున్న దుర్మార్గమైన పోకడ అంటున్నారు.
ఈ చిత్రంలో ఆలయం బయట శివుడి వాహనమైన ఎద్దును కూడా చిత్రీకరించారు. హిందుత్వానికి సంకేతంగా దానిమీద ఒక కాషాయ వస్త్రాన్ని కూడా కప్పారు. ఈ ఎద్దు నంది స్వరూపం అనుకుంటే, ఆ నందికి వైష్ణవ చిహ్నమైన నిలువు నామాలు పెట్టడం తీవ్రమైన వివాదానికి దారితీస్తోంది. హిందువులందరూ ఒక్కటే అయినప్పటికీ.. వారిలో శివ వైష్ణవ తారతమ్యాలు అంతర్లీనంగా ఉంటాయి. శివుడి వాహనానికి విష్ణు నామాలు పెట్టడం శైవాన్ని అవమానించడమే కాకుండా ఒకరి మీదకు ఒకరిని ఉసిగొల్పడం లాగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ కూడా ఈ పోస్ట్ ని తీవ్రంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇద్దరు కూడా ఈ అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధన.. అనే శుభాకాంక్షలు చిత్రంపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సంజాయిషీగాని, వివరణ గాని ఇవ్వకపోతే.. హిందుత్వాన్ని అవమానించడానికి క్రిస్టియన్ ముఖ్యమంత్రి చేస్తున్న కుట్రలుగా ప్రజలు భావించే అవకాశం ఉంది.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles