నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం అయిన నాడు హార్ట్ ఎటాక్ కు గురై.. ఇప్పటిదాకా బెంగుళూరులో చికిత్స పొందుతున్న సినీ హీరో నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం 9 గంటల సమయంలో తుదిశ్వాస విడిచిారు. ఆయన వయస్సు 39 సంవత్సరాలు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న తారకరత్న మరణంతో సినీపరిశ్రమ, తెలుగుదేశం పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రియాశీలంగా ఉండే తారకరత్న, నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు కుప్పంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తారకరత్న కోసం తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. జనం తొక్కిడిలో ఊపిరి ఆడకుండా పోయిన తారకరత్న హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. అప్పటికప్పుడు హుటాహుటిన తారకరత్నను కుప్పంలో ప్రథమచికిత్స అనంతరం, బెంగుళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడే చాలా జాగ్రత్తగా చికిత్సలు అందించారు. విదేశాలనుంచి కూడా నిపుణులైన డాక్టర్లను పిలిపించి చికిత్సలు అందించారు.
అయితే.. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం మరణించారు.
కల తీరనేలేదు
నందమూరి తారకరత్న తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా, క్రియాశీలకంగా ఉంటారు. సాధారణంగా రాజకీయ పార్టీలతో అనుబంధం ఉండే సినిమా హీరోలు ఎన్నికల సందర్భాల్లో ప్రచారంలో మాత్రం పాల్గొంటూ ఉంటారు. కానీ తారకరత్న అలా కాదు. ఆయన అతి తరచుగా పార్టీ కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. తెలుగుదేశం రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు.
ఇటీవల ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఎక్కడినుంచి అనేది నిర్ణయించుకోలేదని, పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ పోటీచేస్తానని తారకరత్న మీడియాతో అన్నారు. అయితే ఎమ్మెల్యే కావాలనే ఆయన స్వప్నం తీరనేలేదు.
తారకరత్న నెమ్మదిగా రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే.. ఆయన కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తోంటే.. తాను స్వయంగా ఆయన వెంట ఉండి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సందర్భంగానే అస్వస్థతకు గురయ్యారు.
శనివారం సాయంత్రానికి బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు అనేకులు బెంగుళూరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు తరలిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అంతలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రికే పార్థివదేహాన్ని హైదరాబాదుకు తరలిస్తున్నారు.
తారకరత్న అందరితోనూ కలుపుగోలుగా స్నేహంగా ఉండే చాలా మంచి వ్యక్తి అని ఆయనను ఎరిగిన వారు చెబుతుంటారు. తారకరత్న మృతికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు.