విశాఖలో మార్చి నెలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ సదస్సు గురించి వాళ్లు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సుకు హాజరవుతారని పాలక పక్షం ఆశిస్తోంది. నిజానికి ఎన్నికలు మరో ఏడాది దూరంలో మాత్రమే ఉండగా ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించడం చిత్రమే. అయితే ఈ సదస్సులో పెట్టుబడిదారులతో ఒప్పందాలు కుదిరితే.. వారు తమ తమ యూనిట్లను గ్రౌండింగ్ చేయడం మరో ఏడాది వ్యవధి తీసుకుంటుందని.. సరిగ్గా ఎన్నికల సమయానికి కొన్ని వేల మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికార పార్టీ ఆశిస్తున్నది. అందుకే ఈ సదస్సు కోసం ఎక్కడెక్కడో సన్నాహక సమావేశాలు పెడుతూ ఇన్వెస్టర్లతో భేటీ అవుతూ వారిని ఆహ్వానిస్తూ మంత్రులు, ముఖ్యమంత్రి కూడా బిజీబిజీగా గడుపుతున్నారు.
తమాషా ఏమిటంటే ఈ తరుణంలోనే.. ప్రధానంగా విశాఖ మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ కి ఏకైక రాజధాని అనే వాదన ఎక్కువగా వినిపిస్తున్నారు. వైసీపీ ఎప్పటిలాగా మూడు రాజధానుల పాట పాడుతూనే ఉన్నప్పటికీ, విశాఖకు మాత్రమే ఆగ్ర పూజ అని సంకేతాలు ఇవ్వడానికి పెట్టుబడుదారుల ప్రతి సమావేశంలోనూ ప్రభుత్వ పెద్దలు తపన పడుతున్నారు.
అయితే ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఒక కీలకమైన నగరం.. సముద్రం ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉంటుంది.. కనుక అక్కడ పెట్టుబడిదారులను సదస్సు నిర్వహిస్తున్నాం అని చెప్పుకోవడం వరకు మంచిదే. . కానీ పెట్టుబడిదారుల ఎదుట ఆ నగరాన్ని మాత్రమే రాజధానిగా ప్రాజెక్టు చేయవలసిన అగత్యం ఏమిటి? . నిజంగా పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉన్నది అనే అంశాన్ని పట్టించుకోడు. మానవ వనరుల లభ్యత, సహజ వనరుల లభ్యత, అతడి పరిశ్రమ ఉత్పాదనలను బట్టి రవాణా వ్యవస్థ ఎంత మేర అందుబాటులో ఉన్నది అనే అంశాలను మాత్రమే గమనిస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రకరకాల వాతావరణ పరిస్థితులు రకరకాల పరిశ్రమలకు వ్యాపారాలకు అనుకూలమైనవనే విషయాలను విపులంగా పెట్టుబడిదారులకు తెలియచెప్పకుండా.. రాజధాని విశాఖలోనే ఉంటుంది అనే అంశాన్ని మాత్రం చాటిచెప్పడంలో అర్థం ఉందా? వచ్చే పెట్టుబడులన్నీ విశాఖలో మాత్రమే కేంద్రీకృతం కావాలని పాలక పక్షం కోరుకుంటున్నదా అనే అనుమానం కలుగుతోంది.
ప్రభుత్వం నిర్వహించే పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలి. రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావాలి పరిశ్రమలు నెలకొనాలి. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు దొరకాలి. అయితే ఇదంతా విశాఖపట్టణం లో మాత్రమే కేంద్రీకృతం కాకూడదు. ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్న మాయమాటలు, చేస్తున్న ప్రచారం వలన.. కేవలం విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే పరిశ్రమలు వస్తే గనుక, ఈ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడులు రాష్ట్రమంతా సమానంగా విస్తరించకపోతే గనుక.. అధికార పార్టీ రాష్ట్రానికి పెద్ద ద్రోహం చేసినట్లు అవుతుంది. . అదే జరిగితే ఎన్నికల నాటికి ఏవో కొన్ని పరిశ్రమలు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలలో నెలకొనవచ్చు కానీ.. తతిమ్మా రాష్ట్రంలోని ప్రజలు మాత్రం వీరిని క్షమించరు. అదేపనిగా విశాఖను ప్రమోట్ చేస్తూ మాయమాటలతో ఊదరగొట్టే ముందు ఈ సంగతిని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలి.