ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి `నమ్మిన బంటు’గా మొన్నటి వరకు ఉంటూ, జగన్ ప్రభుత్వంపై టిడిపి వారెవరైనా చిన్న విమర్శ చేసినా వెంటనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై సభ్యసమాజంలో ఎవ్వరు ఊహించని రీతిలో దుర్భాషలాడుతూ వస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని ధోరణిలో మార్పు వస్తుందా?
తాజాగా, వైఎస్ జగన్ కుటుంబాన్ని ఇరకాటంలో పడవేస్తున్న బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యా కేసుకు సంబంధించి కొడాలి నాని చేసిన `అసందర్భపు’ వాఖ్యలు గమనిస్తే ఇటువంటి అనుమానాలు కలుగుతున్నాయి.
వచ్చే ఎన్నికలలో తన సీటుకు ఎసరు పెడితే, ఇప్పటివరకు చంద్రబాబు, లోకేష్ లను ఏవిధంగా దుర్భాషలాడుతున్నానో, అంతకన్నా ఎక్కువగా జగన్ పై సహితం అస్త్రాలు సంధించగలనని ఒక విధంగా `బ్లాక్ మెయిల్’ చేసేరీతిలో సంకేతం ఇచ్చిన్నట్లు స్పష్టం అవుతుంది.
వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ దర్యాప్తు వేగంగా కదులుతూ, తాడేపల్లి ప్యాలెస్ లోని వ్యక్తులను విచారణకు పిలిచే వరకు సాగుతున్న తరుణంలో `కుటుంభం కలహాల’ కారణంగా ఈ హత్యా జరిగి ఉండవచ్చనే లేనిపోని అనుమానాలను తన వాఖ్యల ద్వారా కొడాలి నాని కలిగించారని వైసిపి వర్గాలు విస్తుపోతున్నాయి.
వివేకానందరెడ్డి కుటుంభం జగన్ కుటుంబం వినాశనాన్ని కోరుకుందని ఘాటైన పదజాలం ఉపయోగించడం ద్వారా హత్యకు లేనిపోని కారణాలను అన్వేషించేందుకు నాని మార్గం చూపుతున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి. జగన్, విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేసి, కాంగ్రెస్ నుండి బాటకు వస్తే, వివేకానందరెడ్డి రాలేదని, పైగా, విజయమ్మపై పులివెందులలో పోటీచేయడం, జగన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం చేశారని ఈ సందర్భంగా నాని గుర్తు చేశారు.
కడప సీటును హత్య జరగక పోయినా నీడవలె అండగా ఉంటున్న అవినాష్ రెడ్డిని కాదని, తమ వినాశనం కోరుకున్న వివేకానందరెడ్డికి ఏ విధంగా ఇస్తారని అంటూ ప్రశ్నించారు. హత్య జరగగానే, ఇదంతా చంద్రబాబు కుట్ర అంటూ ఆరోపణలు గుప్పిస్తూ, 2019 ఎన్నికలలో సానుభూతి పొందే ప్రయత్నం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల చేశారు. ఇప్పుడేమో, జగన్- వివేకానంద రెడ్డి కుటుంబాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడినది నాని సంకేతం ఇస్తున్నారు.
కొడాలి నాని అసందర్భంగా ఈ వాఖ్యలు చేయలేదని, జగన్ ను మరింతగా ఇరకాటంలో నెట్టివేసేందుకే చేశారని ఈ సందర్భంగా పలువురు భావిస్తున్నారు. ఈ వాఖ్యలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అదే రోజున, ఎమ్యెల్యేల పనితీరును సమీక్షిస్తున్న జగన్, పనితీరు అధ్వాన్నంగా ఉన్న 20 మంది ఎమ్యెల్యేలలో మొదటివానిగా కొడాలి నాని పేరును అందరి ముందు ప్రకటించారు. అంటే, పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వడం అనుమానమే అనే సంకేతం ఇచ్చారు.
ఇప్పటికే, వైసీపీలో మరెవ్వరు లేనంత అదూకుడుగా చంద్రబాబుపై నిత్యం దుర్భాషలాడుతున్న తనను మంత్రివర్గం నుండి తీసివేసి, అసలు నోరు విప్పని పలువురిని మాత్రం కొనసాగిస్తూ ఉండడంతో కొడాలి నాని అంతర్గతంగా రగిలి పోతున్నారు. ఇప్పుడు సీట్ కూడా ఇవ్వడం అనుమానమే అనేసరికి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు స్పష్టం అవుతుంది.