మహారాష్ట్రలో పీసీసీ అధ్యక్ష పదవితో సహా పార్టీలో కీలక పదవులు చేపట్టిన సీనియర్ నేత మాణిక్‌రావు థాక్రేను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించడంతో ఇక్కడ పార్టీ వ్యవహారాలు చక్కబెడతారని అనుకున్న వారికి ఆశాభంగమే కలుగుతుంది. ఆయనను సహితం తెలంగాణలోని పార్టీ నేతలు లెక్క చేస్తున్నట్లు కనిపించడం లేదు. దానితో ఆయన అసహనానికి గురవుతున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులందరికీ ఆహ్వానం పంపారు. అయితే 34 మందిలో కేవలం 9 మంది ఉపాధ్యక్షులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దీంతో థాక్రే సీరియస్ అయ్యా రు. సమావేశానికి గైర్హాజరైన ఉపాధ్యక్షులపై కన్నెర్రజేశారు.
మరోవైపు పార్టీ అప్పగించిన పనులు చేయకపోవడం, జిల్లాలకు వెళ్లకపోవడం వంటి అంశాలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కాని వారంతా వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. త్వరలో తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాణిక్‌రావు థాక్రే నేతల కు పలు లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు హా త్ సే హాత్ జోడో యాత్రలో కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు.
కానీ నేతలు అటు పక్క తొంగి చూడకపోవడంతో తీవ్ర అసహనం వ్య క్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇటు పార్టీ సమావేశాల్లో పాల్గొనక, అటు తమకు అప్పగించిన పార్టీ బాధ్యతలను విస్మరించడాన్ని థాక్రే తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని, హైకమాండ్‌కు నివేదిక అందజేస్తానని కూడా సమావేశంలో పేర్కొన్నారు.
తాను కూడా త్వరలో పార్లమెంటు నియోజక వర్గాలల్లో పర్యటిస్తానని చెబుతూ ఈ నెల 28వ తేదీన భువనగిరి, మార్చి 1వ తేదీన నల్గొండ, 2వ తేదీన ఖమ్మంలో పర్యటించనున్నట్లు వివరించారు. ఇంఛార్జి బాధ్యతలు సక్రమంగా నిర్వహించనట్లయితే తక్షణమే వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని, పార్టీకి సమయం కేటాయించని వారు ఎంతటి వారైనా అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అయితే, కొందరు ఉపాధ్యక్షులు పార్టీ పట్ల ధిక్కరణ ధోరణి ప్రదర్శిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ప్రస్తావించగా ఇంకోసారి మాట్లాడదామని ఇన్ ఛార్జ్ దాటవేయడం వారికి విస్మయం కలిగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాలపాలకు పాల్పడుతున్న కోమటిరెడ్డిపై చర్యకు అధిష్టానం సుముఖంగాలేదనే సంకేతం ఇచ్చినట్లయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాలపడుతున్న వారిని వెనకేసుకు వస్తూ, ఇతరులు పార్టీ పనిచేయడంలేదని విరుచుకు పడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడని, ఇప్పటికే ఆయనతో మాణిక్ రావు థాక్రేతో మాట్లాడారని చెప్పడం గమనార్హం. మాణిక్ రావు థాక్రేను కలిసిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహితం వెంకటరెడ్డి మాటలను వక్రీకరించారని పేర్కొనడం గమనిస్తే వెంటకరెడ్డికి పార్టీ అధిష్ఠానం మద్దతు ఉన్నట్లు స్పష్టం అవుతుంది.