ఏపీలో 16 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల, స్థానిక సంస్థల ప్రతినిధుల బలాలను పరిశీలిస్తే ఆ 16 స్థానాలలో గరిష్టంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు ముంచుకు రానున్న తరుణంలో.. వివిధ నియోజకవర్గాలలో ఉండే బలమైన అసంతృప్త నాయకులను బుజ్జగించడానికి, తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకుంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. ఎమ్మెల్సీ పదవులను ఎరగా చూపించి తెలుగుదేశం నాయకులపై ఒక పెద్ద వల విసిరింది. ఏకంగా 16 స్థానాలు ఖాళీ ఉండటం, వైసీపీలో జగన్ మాట వేదంగా చెల్లుబాటు కావడం అనే కారణాలు చూపిస్తూ.. తెలుగుదేశం నాయకులను పార్టీలోకి ఆకర్షించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ చాలామంది కోసం విసిరారు గానీ, జయమంగళ వెంకటరమణ రూపంలో అందులో ప్రస్తుతానికి ఒక చేప మాత్రమే పడింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ప్రజలలో తమ బలం తగ్గిపోవడం లేదని, నాయకులందరూ తమను తమ పార్టీని గౌరవం గానే చూస్తున్నారు అని నిరూపించుకోవడం ఒక పెద్ద ప్రయాసగా మారుతోంది. వైసీపీ నుంచి అనేకమంది సీనియర్లు బలమైన నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునిగిపోయే పడవ లాగా తయారైందని, అందుకే ఆ సంగతి ముందుగానే గ్రహించిన సీనియర్లు జాగ్రత్త పడుతున్నారని రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. నెల్లూరు జిల్లాలోని ఆనం, కోటంరెడ్డి వంటి నాయకులు తెలుగుదేశం లో చేరబోతుండటం మాత్రమే కాదు. చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి అనేకమంది ఎన్నికల్లో తాము పోటీ నుంచి తప్పుకొని వారసులను ముందుకు నెట్టాలని ఆలోచిస్తూ ఉండడం కూడా పార్టీ దుస్థితికి దర్పణమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు పవన్ కళ్యాణ్ పంచన చేరబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చే ఫ్లెక్సీలు కూడా ఒక గందరగోళం సృష్టించాయి. వైసీపీ నుంచి బయటకు వెళ్లే వారే తప్ప లోపలికి వచ్చేవారు కనిపించడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పరువు కాపాడుకోవడం వారికి ప్రయాసగా మారుతోంది. అందుకే ఎమ్మెల్సీ పదవులను ఎరగా వేసి, తెలుగుదేశంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులను ఆకర్షించడానికి వైసిపి ప్రయత్నిస్తున్నదని సమాచారం. ఈ ఎర్రకు ముందుగా పడిన చేప.. జయమంగళవెంకటరమణ. త్వరలోనే తాను బీఫారంతో వచ్చి ఎమ్మెల్సీ గా నామినేషన్ వేస్తానని.. పార్టీ కండువా కప్పుకున్న రోజునే ఆయన ప్రకటించారు. దీంతో ఏ కారణం చేత ఆయన తెలుగుదేశాన్ని వీడారో అందరికీ అర్థమైపోయింది. తన కులం వారందరూ తెలుగుదేశాన్ని అభిమానిస్తారు గాని, తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వలన ఈ దఫా ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని తాను భావిస్తున్నట్లు వెంకటరమణ చెప్పారు. ఆయన సిద్ధాంతం ఏ మేరకు నిజం అవుతుందో తెలియదు. కాకపోతే ఎమ్మెల్సీ పదవులను తాయిలంగా చూపిస్తూ, తెలుగుదేశం నాయకులను ఆకర్షించడానికి వైసిపి ప్రయత్నిస్తున్నదని మాత్రం స్పష్టం అవుతోంది.