భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖకు గతంలో అధ్యక్షుడిగా కూడా సేవలందించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఏపీ రాజకీయాలలో తాజా కీలక పరిణామం. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా అనేది అనూహ్యమైన పరిణామం కాదు చాలా కాలంగా దీనికి సంబంధించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. . అయినా భారతీయ జనతా పార్టీ మీద, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మీద తన ధిక్కారస్వరాన్ని వినిపిస్తూనే వచ్చారు. జాతీయ పార్టీకి చెందిన కీలకమైన సీనియర్ నాయకులతో మంతనాలు జరిపి సోమరాజు సారధ్యంలో పార్టీ ఎలా పతనమవుతున్నదో తన అభిప్రాయాలను నివేదించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఎవ్వరూ ఆయన మాటలను వాదనలను చెవిన వేసుకోలేదు. అంతిమంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
ఒక శాతం మోటు బ్యాంకు ఉన్న పార్టీకి రాజీనామా చేయడం వలన.. కన్నా లక్ష్మీనారాయణ కోల్పోయేది పెద్దగా ఉండకపోవచ్చు. జనసేన, తెలుగుదేశం.. తన భవిష్యత్తు ప్రస్థానం కోసం కన్నా లక్ష్మీనారాయణ ఎంచుకోబోయే పార్టీ ఏదైనా కావచ్చు గాక. ఇక్కడికంటే ఆయనకు ఎంతో కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది తప్ప.. దిగజారి పోయే అగత్యం ఏర్పడదు. కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ లాభమే తప్ప నష్టం లేదు. అయితే ఆయన భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టడం వలన, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం నష్టం తప్పదు అనే మాటను అంగీకరించాల్సిందే.
కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా పరిమితం గానూ గుంటూరు జిల్లాలో ఒక మోస్తరుగాను ప్రభావం చూపగలిగిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి చాణక్య రాజకీయ వ్యూహాలు పనిచేస్తే.. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. తెలుగుదేశంతో కలిసి బరిలోకి దిగడానికి బిజెపి సారధి సోము వీర్రాజు కీలకంగా అడ్డుపడుతున్న నేపథ్యంలో జనసేన టిడిపి పొత్తు మాత్రమే కార్యరూపం దాల్లుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. భారతీయ జనతా పార్టీ మొత్తం 175 స్థానాలలో పోటీ చేసినా కూడా జగన్ వ్యతిరేక ఓటును చీల్చడానికి, తద్వారా జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప ఇతరత్రా సాధించేది ఏమీ ఉండదు. జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తుంటారని ముద్ర కలిగి ఉన్న సోము వీర్రాజు కోరిక కూడా బహుశా అదే కావచ్చు.
అలాంటప్పుడు, కన్నా లక్ష్మీనారాయణ వంటి కొమ్ములు తిరిగిన నాయకులు ఎంతమంది ఆ పార్టీలో ఉన్నా సరే వారందరూ చెమటను చిందించి, నెత్తురు ధార పోసి.. చివరికి జగన్ మోహన్ రెడ్డిని గెలిపిస్తారు అనేది సత్యం. ఆ రకంగా తాను జగన్ ఆడే ఆటలో పావుగా మారడం ఇష్టం లేక కన్నా లక్ష్మీనారాయణ బిజెపిని వీడి ఉండవచ్చు!
ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరినా సరే అది కచ్చితంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకమే అవుతుంది. బిజెపి తరఫున ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చగలిగే స్థాయి నాయకులు ఆ పార్టీని వీడిపోతే నష్టం జరగకుండా ఎలా ఉంటుంది?