గత మూడేళ్ళుగా సీఎం వైఎస్ జగన్ చెబుతున్న `మూడు రాజధానులు’ కేవలం రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అని, ఆయన దృష్టి అంతా విశాఖపట్నంపైననే ఉందని ఆర్ధికమంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి మాటలతో వెల్లడైంది. అపారమైన భూకబ్జాలకు అక్కడ అవకాశాలు ఉండడమే కాకుండా, అక్కడ ఎటువంటి అక్రమాలకు పాలపడిన రాష్ట్రంలోని మిగిలిన ప్రజల దృష్టిలో పడదని భరోసా అందుకు కారణంగా స్పష్టం అవుతుంది.
ప్రస్తుతం అమరావతిలో అయితే చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్దవిగా ప్రచారం పొందే ప్రమాదం ఉందని ఇక్కడి నుండి మకాం మార్చడం కోసం తొందరపడుతున్నట్లు వెల్లడవుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో, అక్కడినుండి ఏమాత్రం సౌలభ్యం లభించినా మకాం మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
విశాఖ కేంద్రంగానే పరిపాలన చేస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. దీంతో వైజాగ్ ఒక్కటే రాజధానిగా ఉంటుందా? అనే సందేహంలో ఉన్న ఈ సమయంలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాటలు దీనికి ఊతమిస్తున్నాయి. దానితో వైజాగ్ మాత్రమే ఏపీ రాజధాని అంటూ ప్రచారం ఉపందుకొంటున్నది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మీడియా ముందుకొచ్చి వివరణలు ఇస్తున్నారు. మూడు రాజధానులపై నెలకొన్న సందేహాలకు క్లారిటీలు ఇచ్చే పనిలో పడ్డారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. విశాఖనే రాజధానిగా ఉండాలంటూ వస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను నిర్ణయించామని ప్రభుత్వ వాదన వినిపించారు.
రాజధానిపై జగన్ మాటలు వింటే ఊసరవెల్లికి కూడా సిగ్గేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆనాడు జగన్ రాజధాని అమరావతికి పూర్తి మద్దతు ఉంటుందన్నాడని గుర్తు చేశారు. అమరావతి కట్టండి.. నేను కూడా ఇల్లు అక్కడే కట్టుకుంటానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చేశాడని ధ్వజమెత్తారు. ముందు మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు.
కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని, విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, ఇప్పుడు మాట మార్చి విశాఖే రాజధాని అంటున్నారని దుయ్యబట్టారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడని పేర్కొంటూ బుద్ధి ఉన్నవాళ్లు మళ్లీ జగన్‌ను ఎన్నుకుంటారా..? ఇటువంటి దుర్మార్గుడికి ఓటేస్తారా..? అని ప్రశ్నించారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడ్రోజుల పర్యటన ప్రారంభిస్తూ ఈ ప్రశ్నలు సంధించారు.