వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అందుకోసమే ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, దీర్ఘకాలిక సమస్యలను ఈ నెల 26లోపు పరిష్కారం కాకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం రెండు రోజుల క్రితం వినతిపత్రం అందజేశారు. జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు తమ సొంత అవసరాలకు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పిల్లల పెళ్లిళ్లు, ఆస్పత్రులకు వెళ్లి దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయించుకోలేక, సొంత ఇల్లు రిపేర్లు చేయించుకోలేక అన్నీ వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని పేర్కొన్నారు.
11వ పిఆర్‌సిలో పొందుపరచిన క్యాడర్ వారి స్కేల్స్‌ను సంబంధిత శాఖాధిపతులకు పంపలేదంటే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అర్థమవుతోందని మండిపడ్డారు. 11వ పిఆర్‌సిలో నేటికీ చాలా శాఖల్లో ఉద్యోగులకు స్పెషల్ పేలు, అలవెన్స్‌లు సంగతి తేలలేదని నిరసన వ్యక్తం చేశారు. పైగా,11వ పిఆర్‌సి (అమలు తేదీ 1.4.2020 నుంచి 31.12.21 మధ్య కాలానికి) ఎరియర్స్ నేటికీ చెల్లించలేదని పేర్కొన్నారు.
గతేడాది పదవీ విరమణ, మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎవరికీ ఎలాంటి బెనిఫిట్స్ అందలేదని విమర్శించారు. ఎరెండ్ లీవ్‌లు, సరెండర్ లీవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ లోన్లు, విత్‌డ్రాలు, లీవ్ శాలరీలు, సప్లిమెంట్ బిల్లులు, టూర్ టిఎ బిల్లులు గత రెండేళ్లుగా రావడం లేదని చెప్పారు. రెవెన్యూశాఖలో విఆర్‌ఎలుగా పనిచేస్తూ విఆర్‌ఒ గ్రేడ్-2లుగా పదోన్నతి పొందిన వారందరికీ పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేసి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేయాలని, సీపీఎస్ ఉద్యోగుల 10నెలల మ్యాచింగ్ గ్రాంటును ప్రాన్ ఖాతాల్లో జమచేయాలని, ఏపీజీఎల్‌ఐ రుణాలు, డీఏ బకాయిలు రూ.20వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరోవంక, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. వేతనాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన నేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘం నేతలు హైకోర్టు ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులపై స్టే విధించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.