ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత భర్తకు కూడా నోటీసులు!

Thursday, May 2, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లోతుగా చిక్కుకున్నట్లు స్పష్టం అవుతుండగా, త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను అరెస్ట్ కూడా చేయవచ్చని కధనాలు వెలువడుతుందనగా, మరోవంక ఆమె భర్త అనిల్‌కు సహితం ఈ కుంభకోణంలో పాత్ర ఉందనే ప్రచారం సాగుతుంది.  ఆయనకు కూడా త్వరలోనే ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తున్నది.

లిక్కర్ పాలసీకి సంబంధించి హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన కీలకమైన సౌత్ గ్రూపు సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్కాంలో అనిల్ వ్యవహారంపై కూడా ఈడీ దృష్టి సారిస్తున్నది. ఈ సమావేశంలో రామచంద్రన్ పిళ్లై, బోయిన్ పల్లి అభిషేక్, శరత్ చంద్రారెడ్డి పాల్గొనగా.. అనిల్ కూడా ఆ భేటీలో ఉన్నట్లు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.

దీంతో త్వరలో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. ఆ రోజు సమావేశంలో అసలు ఏం మాట్లాడుకున్నారు? పాలసీ రూపకల్పనలో ఏం జరిగింది? అనే వివరాలను అనిల్ ద్వారా తెలుసుకోనున్నారని చెబుతున్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో చాలామంది మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను తరచూ మార్చారని, డిజిటల్ ఆధారాలు దొరక్కుండా రీసెట్ చేశారని ఈడీ ఇటీవల దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో పేర్కొంది.

ధ్వంసం చేసిన, కవిత వాడిన ఫోన్లలో అనిల్ సంభాషణలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో వాటి గురించి తెలుసుకునేందుకు అనిల్‌ను ఈడీ ప్రశ్నించనున్నట్లు భావిస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనను సీబీఐ అధికారులు రిమాండ్‌లోకి తీసుకున్నారు.

స్కాంలోని పాత్రదారుల గురించి బుచ్చిబాబును కొద్దిరోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన నుంచి సీబీఐ మరిన్ని వివరాలను రాబట్టే అవకాశముంది. ఆయన చెప్పే విషయాల ఆధారంగా మరికొంతమందిపై సీబీఐ, ఈడీ చర్య తీసుకునే అవకాశం ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles