ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను మోనార్క్‌ని అనే ధోరణితో వ్యవహరిస్తారనే సంగతి అందరూ ఉంటుంటారు. తాను ఏం తలపెడితే అది జరిగి తీరాల్సిందే అనే పట్టుదలతో ఉంటారని అందరూ చెబుతుంటారు. తన సొంత పార్టీ వ్యవహారాలలో ఆయన ఇలాంటి ధోరణి అనుసరిస్తే చెల్లుబాటు అవుతుందేమో కానీ, ప్రభుత్వం పాలన సాగించే విషయంలో ప్రతిదీ అలా జరగాలంటే కుదరదు! ఇక్కడ ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఉంటుంది! చట్టానికి, రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఎవ్వరైనా పనిచేయాల్సి ఉంటుంది. అయితే అనేక సందర్భాలలో తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ, అవి ఎంత రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నా సరే చెల్లుబాటు కావాల్సిందే అని జగన్ సర్కారు పట్టుదలకు పోతూ ఉండడం తరచూ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా తెగేదాకా లాగుతున్న, పట్టుదలకు పోయిన ప్రతిసారీ జగన్ సర్కారుకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.
దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల పట్ల వెల్లువెత్తే ప్రజాస్వామిక అభ్యంతరాలను తోసిపుచ్చడం, ఖాతరు చేయకపోవడం, ఒంటెద్దు పోకడలను అనుసరించడం, చివరకు వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్ళిన తర్వాత మొట్టికాయలు వేయించుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. తాజాగా మళ్లీ అలాంటిదే ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా సేవలందించిన ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలంటూ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయనను డిస్మిస్ చేయవలసిన అవసరం లేదని, రెండు ఇంక్రిమెంట్లు నిలిపేస్తే చాలునని కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగిస్తున్న రోజుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏ బి వెంకటేశ్వరరావు అప్పటి చంద్రబాబు నాయుడు సర్కారుకు అనుకూలంగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు. ఆయనను పదవి నుండి తప్పించారు. ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్లి సుదీర్ఘకాలం పోరాడి మళ్లీ విధుల్లో చేరేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఆయనకు నామమాత్రపు అప్రాధాన్య పోస్టింగ్ ను కట్టబెట్టిన ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండగా ఆయన అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలతో పదవి నుంచి డిస్మిస్ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపింది. తాజాగా ఈ ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ తిరస్కరించింది. వ్యవస్థలతో మాత్రమే కాదు కదా వ్యక్తులతో కూడా విభేదించి, వైరం పెట్టుకుని వారి చేతిలో పరాభవానికి గురి కావడం ప్రభుత్వానికి అలవాటు అయిపోతోంది.
కోర్టుల ద్వారా ప్రభుత్వ కీలక నిర్ణయాలు పరాభవానికి గురికావడం, పరిహాసాస్పదం కావడం ఒక ఎత్తయితే.. ఒక ఉద్యోగి సర్వీసు మేటర్ విషయంలో కూడా పంతానికి పోయిన సర్కారు నవ్వులపాలు అయిందని ప్రజలు భావిస్తున్నారు.
జగన్ పంతానికి పోతోంటే.. పరువు పోతోంది!
Monday, December 23, 2024