అసాంఘిక శక్తులు, గంజాయికి అడ్డాగా తాడేపల్లి

Thursday, September 19, 2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసానికి కూతవేటు దూరంలోని తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో రాజు అనే రౌడీ షీటర్ నరికి చంపడం కలకలం రేపుతోంది.  పరిసరాల్లో పటిష్టమైన పోలీసు పహారా, నిఘా వ్యవస్థలు పనిచేస్తుంది సీఎం ఇంటి పరిసరాలైన తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులు, గంజాయికి అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం అవుతుంది.

తన నివాస పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే అని ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల వైఫల్యం, ఆడ బిడ్డలపై అఘాయిత్యాలపై మహిళా సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులు గళమెత్తాలని పవన్ పిలుపునిచ్చారు.

టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత అంధ యువతి హత్య ఘటనను టార్గెట్ చేసి జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. “జగన్ రెడ్డి గారు, మీ ఇంటికి కూతవేటు దూరంలోనే అంధ బాలికను నిర్దాక్షిణ్యంగా నరికి చంపేటంత గంజాయి మత్తులో రాష్ట్రం ఉంది” అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంధ బాలికకు, మానసిక వికలాంగురాలికీ కూడా రక్షణ లేకుండా పోయింది. తరచూ మీ ఇంటి సమీపంలోనే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నా మీ నుండి ఏ విధమైన చర్యలూ లేవని ఆమె విమర్శించారు. మీ అధికార దాహానికి ఇంకెందరు ఇలా బలయిపోవాలి? అంటూ ప్రశ్నించారు.

నిందితుడు రాజు గతంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుతో పాటు ఇంటి సమీపంలో వివాహిత మీద గొడ్డలితో దాడి చేసినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. తాడేపల్లి పోలీసులతో ఉన్న స్నేహాల వల్ల ఇలాంటి దారుణాలు తెగబడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసానికి సమీపంలో యువతి హత్యకు గురైన ఘటన కలచివేసిందన్న పవన్ కళ్యాణ్ కంటి చూపునకు నోచుకోని యువతిని వేధింపులకు గురి చేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ హత్య ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలని పవన్ స్పష్టం చేశారు.

ఏడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలోనే ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్ని ఇప్పటికీ పట్టుకోలేకపోవడం గమనార్హం. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయి.. దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండాపోయిందని విమర్శలు చోటుచేసుకొంటున్నాయి.

అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి అంటే… తల్లి పెంపకంలోనే లోపం ఉందని… ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పదవులు ఇచ్చినవారిని మెప్పించేందుకు రాజకీయపరమైన ప్రకటనలు, నోటీసులు ఇస్తే మహిళలకు రక్షణ, భరోసా దక్కదనే విషయం గుర్తించాలని పవన్  హితవు పలికారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చేశారని,రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles