ఆకస్మికంగా గవర్నర్ మార్పుతో సీఎం జగన్ లో కలవరం!

Thursday, September 19, 2024

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంలో భాగంగా ఆకస్మికంగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఛత్తీస్‌గఢ్‌కు బదిలీచేయడం రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నది. ఈ బదిలీ ఒక విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖంగుతినేటట్లు చేసిందని చెబుతున్నారు. హరిచందన్ బిజెపికి చెందిన వ్యక్తి అయినప్పటికీ పరిపాలనలో జగన్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు సహితం అండగా నిలబడుతున్నారు.

పైగా, ఆయన స్థానంలో మొన్నటి వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను నియమించడం ఓ విధంగా జగన్ ను ఇరకాటంలోకి నెట్టివేసిన్నట్లయింది. ప్రస్తుత గవర్నర్ మాదిరిగా అడ్డదిడ్డంగా న్యాయవ్యవస్థ పట్ల ధిక్కారధోరణి ప్రదర్శిస్తున్న ప్రభుత్వ ధోరణి పట్ల సహనంతో వ్యవహరించే అవకాశం ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం అవుతుంది.

గవర్నర్ బదిలీ కాగానే, జగన్ వెంటనే హరిచందన్ ను కలసి అయన బదిలీ పట్ల ఓ విధంగా విచారం వ్యక్తం చేశారు. ఆయన అందించిన సహకారంకు, సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దీ అర్జులుగా జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పరిశీలిస్తున్నవారికి గవర్నర్ బదిలీ వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

జగన్ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నా, గవర్నర్ సహితం సన్నిహితంగా వ్యవహరించడాన్ని కేంద్రం సహింపలేక పోతుందనే సంకేతం వెలువడి నట్లయింది. మరో 15 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అవసరమైన్నప్పుడు కఠినంగా వ్యవహరించే గవర్నర్ అవసరమనే అభిప్రాయానికి వచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. పలువురు గవర్నర్ల మార్పులో సహితం ఇటువంటి ధోరణి కనిపిస్తున్నది.

ముఖ్యంగా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మేఘాలయ, మణిపూర్ గవర్నర్ లను మార్చడం వెనుక అక్కడ బిజెపికి మెజారిటీ రాకపోయినా ప్రభుత్వం ఏర్పాటులో దూకుడుగా వ్యవహరించగల వారు రాజ్ భవన్ లో ఉండాలనే మార్పు చేసిన్నట్లు స్పష్టం అవుతున్నది. అదేవిధంగా, ఏపీలో సహితం 2024 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రయోజనాలకు అనువుగా వ్యవహరించే గవర్నర్ కోసం చూస్తున్నట్లు అర్ధం అవుతుంది.

ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో క్రైస్తవులకు లభిస్తున్న ప్రాధాన్యత, మతమార్పిడులకు లభిస్తున్న ప్రోత్సాహం, దేవాలయాలపై జరుగుతున్న దాడులు వంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించగల వారు గవర్నర్ గా ఉంటాలనే అభిమతం కూడా వెల్లడి అవుతుంది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తంచేసిన అభిప్రాయం ఆసక్తి కలిగిస్తున్నది.

గవర్నర్ మార్పు ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి హెచ్చరిక సంకేతాలు అందినట్టేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్డిగా మద్దతు ప్రకటిస్తూ వస్తోన్న బ్యూరోక్రాట్లు ఇప్పటికైనా జాగ్రత్త పడాలని సూచించారు. వైసీపీకి అండగా ఉంటున్న అధికార యంత్రాంగం కర్మ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవాలని ఓ విధమైన హెచ్చరిక జారీచేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిబిఐ దూకుడుగా వ్యవహరించడం,  నేరుగా జగన్ కు వరుసకు సోదరుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ ను విచారించడంతో పాటు నేరుగా జగన్ ఓఎస్డి, ఆయన భార్య భారతి పిఏలను సహితం విచారించడంతో ఇప్పటికే జగన్ కేంద్రం వైఖరి అర్ధంకాక తికమక చెందుతున్నారు. ఇంతలో రాజధాని అమరావతి విషయంలో ఒకేరోజున పార్లమెంటులో, సుప్రీంకోర్టులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు జగన్ ను ఇరకాటంలో పడవేశాయి. ఇటువంటి సమయంలో గవర్నర్ మార్పు ఓ హెచ్చరికగా కనిపిస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles