ప్రధాని నరేంద్రమోడీ చాలా విస్పష్టంగా హెచ్చరికలు చేశారు. అనుభవ సారంతో, ప్రపంచదేశాలను పరిణామాలను గమనిస్తున్న జ్ఞానంతో ఆయన చాలా లోతైన సలహాలు ఇచ్చారు. అయితే అధికార లాలసత, ఓటు బ్యాంక్ రాజకీయాలు, నజరానా రాజకీయాలు మాత్రమే అలవాటు అయిన, అవి మాత్రమే తమ రాజకీయ ప్రస్థానానికి జీవన వేదంగా మార్చుకున్న నాయకులకు ఈ హితవాక్యాలు హెచ్చరికలు చెవికెక్కుతాయా? అనేది సందేహం. మితిమీరి అప్పులు చేస్తూ పోతే ఏ రాష్ట్రానికైనా అనర్థం తప్పదని, పొరుగు దేశాలకు వాటిల్లిన దుస్థితులను గమనించి.. అందరూ పాఠాలు నేర్చుకోవాలని నరేంద్రమోడీ అంటున్నారు. మరి, అలవిమాలిన అప్పులను తన హక్కుగా మార్చుకున్న జగన్ ఈ మాటలను చెవికెక్కించుకుంటారా? అనేది సందేహం.
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నజరానా రాజకీయాలను అసహ్యించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రజలను మభ్యపెట్టి కానుకల ద్వారా రాజకీయం చేయడం కరెక్టుకాదనే వాదనను ఇటీవలి కాలంలో మోడీ సర్కారు చాలా ప్రబలంగా వినిపిస్తోంది. అదే సమయంలో, సంక్షేమ పథకాల ముసుగులో మితిమీరి అప్పులు చేసుకుంటూ పోవడాన్ని కూడా వ్యతిరేకిస్తోంది.
ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల రూపాయల రుణభారాన్ని ఏపీ మీద మోపేశారు జగన్. అప్పు పుట్టకపోతే.. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నది స్పష్టం. ఒక రకంగా చెప్పాలంటే.. అచ్చంగా ఏపీని హెచ్చరిస్తున్నట్టుగానే ప్రధాని మాటలు ఉన్నాయి.
రాజకీయ అవసరాల కోసం జనాకర్షక విధానాల వెంట పరుగెడుతూ.. విపరీతంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రధాని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇరవై నాలుగ్గంటలూ రాజకీయాలు చేయాలని ప్రయత్నించే వారికి అసలు ఆర్థిక విధానాలు అర్థమయ్యే పరిస్థితి లేనే లేదని మోడీ అనడాన్ని చాలా సీరియస్ వ్యాఖ్యగా పరిగణించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం విషయానికి వస్తే.. సంక్షేమ పథకాలు, ఆ ముసుగులో జనానికి డబ్బు పంచిపెట్టే వ్యవహారాలకు తప్ప.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంపై కూడా ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదనే విమర్శలున్నాయి. మోడీ మాటలు అచ్చంగా ఏపీని చూసి అన్నట్లుగానే ఉన్నాయా అనిపిస్తుంది కూడా. ఇలా ఇష్టానుసారం అప్పులు చేసి దేశాన్ని ఎలా ముంచేశారో ఇరుగు పొరుగు దేశాల్ని చూసి నేర్చుకోవాలని మోడీ అంటున్నారు. మరి ఆ హెచ్చరికలు, చేస్తున్న అప్పుల వలన రాగల ప్రమాద సంకేతాలు ముఖ్యమంత్రి జగన్ కు అర్థం అవుతాయో లేదో?
మోడీ హెచ్చరికలు జగన్‌కు వినిపిస్తున్నాయా?
Monday, December 23, 2024