తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ఆ ప్రాంతాన్ని రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలను మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది.. కసరత్తు సాగిస్తోంది. సహజంగానే రాష్ట్ర ప్రజలలో ఈ రెండు రకాల ప్రభుత్వ నిర్ణయాల పట్ల వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. రెండు ఆలోచనలకు మద్దతు ఇచ్చేవారు.. వ్యతిరేకించేవారు ఉన్నారు. మూడు రాజధానుల ఆలోచనను కొట్టి పారేస్తూ అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాతావరణం మారింది. అయితే జగన్ మాత్రం కొన్ని నెలల్లోనే విశాఖకు రాజధాని తరలిపోతుందని తాజాగా ప్రకటించడం ద్వారా ప్రజల్లో ఉన్న ఆస్పష్టతను గందరగోళాన్ని భయాలను ఇంకాస్త రాజేశారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ఆధారంగా మాత్రమే అమరావతిని రాజధానిగా నోటిఫై చేశామని, విస్పష్టంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలలో విపరీతమైన గందరగోళం నెలకొంది. ప్రజలలో ఈ గందరగోళాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద తప్పకుండా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి రాజధాని విశాఖకు తరలిపోతుందని తన వాగ్దానం పట్ల, అమరావతిని రాజధానిగా నోటిఫై చేశామంటున్న కేంద్రం వాదన పట్ల ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్రం ప్రకటన నేపథ్యంలో రాజధానిని తరలించడం అనేది ఎప్పటికీ అసాధ్యం అని తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
సామాన్య ప్రజలలో మాత్రం అసలు మన రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా అనే ఆవేదన కలుగుతోంది. వారిలో ఈ భావనను తొలగించడం ముఖ్యమంత్రి బాధ్యత. చాలా విషయాలలో కేంద్రం నిర్ణయాలను సమర్థిస్తూ ముందుకు సాగే ముఖ్యమంత్రి జగన్, అమరావతి రాజధాని విషయంలో కేంద్రం ప్రకటన పట్ల కూడా తన వైఖరి స్పష్టం చేయాలి. అలా చేయకపోతే గనుక ప్రజలను ఇదే మాదిరి గందరగోళంలో మరింతగా ముంచేసి.. వారు ఆ గందరగోళంలో ఉండగానే ఎన్నికల పర్వం ముగించి అనుచిత మార్గంలో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారనే వాదన ఒకటి తలెత్తుతుంది.
కనీసం రాజధాని వంటి కీలక విషయాల్లోనైనా ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి. తతిమ్మా అన్ని పార్టీ వ్యవహారాల మాదిరిగా తన తరఫున మరొకరితో ప్రకటనలను చేయించడం వల్ల ఉపయోగం లేదు. అలాంటి ప్రయత్నాలు ప్రజల్లో గందరగోళాన్ని మరింతగా పెంచుతాయే తప్ప.. తగ్గించవు.
జగన్ నోరు తెరిచే దాకా అందరికీ భయాలే!
Monday, December 23, 2024