మరి కొన్ని నెలల్లోనే నేను కూడా నివాసం విశాఖకు మార్చుకుంటున్నాను. త్వరలోనే రాజధాని కూడా విశాఖకు తరలిపోనుంది.. అని గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఢిల్లీలో సన్నాహక సమావేశంలో చెప్పిన తర్వాత.. ‘విశాఖలో రాజధాని’ అనే వాదానికి మరింత ఊపు వచ్చిందని సీఎం జగన్మోహన్ రెడ్డి మురిసిపోయి ఉండవచ్చు. ఆ మాట ద్వారా.. మూడు రాజధానుల ప్రకటనకు మళ్లీ ఊపు వస్తుందని, తద్వారా తాము ఆశించే అనేకానేక ప్రయోజనాలు నెరవేరుతాయని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ.. విజయసాయిరెడ్డి అనవసరంగా పార్లమెంటులో కెలకడం వల్ల మొత్తం వ్యూహం సర్వనాశనం అయిపోయింది. ఈ అనవసరపు కెలుకుడు కారణంగా.. విజయసాయిపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఆగ్రహానికి రెండు కారణాలు వినిపిస్తున్నాయి.
ఇంతకూ విజయసాయి ఏం కెలికారు? వైసీపీ మూడురాజధానులకు కట్టుబడి ఉన్నదనే విషయాన్ని పార్లమెంటు వేదికగా స్పష్టం చేయాలని ఆయన అనుకున్నారు. రాజ్యసభలో తన ప్రసంగంలో.. ఈ పాయింట్ లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణాల ప్రకారమే మూడురాజధానుల బిల్లు తమ ప్రభుత్వం తెచ్చిందని, రాజధాని నిర్ణయంపై రాష్ట్రప్రభుత్వ అధికారాన్ని కేంద్రంగానీ, న్యాయవ్యవస్థ గానీ అడ్డుకోజాలవని ఆయన హెచ్చరించారు.
ఈ మాటల ద్వారా న్యాయవ్యవస్థ అతి చేసిందని అన్నందుకు రాజ్యసభ ఛైర్మన్ అక్షింతలు ఎదుర్కోవాల్సి రావడం ఒక ఎత్తు. కేంద్రానికి అధికారమే లేదని అన్నందుకు కేంద్రంలోని బిజెపికి ఆగ్రహం తెప్పించడం అనేది మరో ఎత్తు. అసలే అనేకానేక కారణాల దృష్ట్యా కేంద్రంలోని బిజెపి సర్కారును ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం పరితపిస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డికి.. విజయసాయి ప్రసంగం ఖచ్చితంగా చికాకు తెప్పించి ఉంటుంది. కేంద్రానికి అధికారమే లేదని ఆయన అనడం, రాజధాని నిర్ణయంలో సర్వాధికారాలు తమ సర్కారువే అని విర్రవీగడం బ్యాక్ ఫైర్ అయినట్లు ఆయన భావిస్తున్నారు.
దానికి తగ్గట్టుగానే.. కేంద్రమంత్రి శాసనసభలో ప్రకటన కూడా చేశారు. అప్పట్లోనే రాజధాని అధ్యయనానికి కేంద్రం నిపుణుల కమిటీని వేసిందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగానే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రకటించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగానే ఆయన ఈ మాట చెప్పడం వైసీపీకి ఇరకాటం కలిగించే సంగతి.
అది చాలదన్నట్టుగా విభజన చట్టం 5, 6 సెక్షన్లలో రాజధాని గురించి ఉన్నదని, కేంద్రం అమరావతి రాజధానికోసం నిధులు కూడా ఇచ్చిందని, సెక్షన్ 94 లో నిధులకు హామీ కూడా ఇచ్చిందని కేంద్రం చాలా స్పష్టంగా సుప్రీంలో అఫిడవిట్ వేసింది. జగన్ సర్కారు మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు తెచ్చినప్పుడు కేంద్రాన్ని సంప్రదించలేదని కూడా ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అనవసరంగా విజయసాయిరెడ్డి కెలకడం వల్లనే.. కేంద్రంనుంచి అమరావతి రాజధాని అనుకూల ప్రకటనలు వెలువడ్డాయని పార్టీలో పలువురు భావిస్తున్నారు.
విజయసాయిపై జగన్ గుస్సా.. కెలుకుడు ఎందుకు?
Sunday, January 19, 2025