కర్ణాటకలోని `ఎగువ భద్ర’ ప్రాజెక్ట్ తో రాయలసీమకు కేంద్రం గొడ్డలిపెట్టు

Thursday, September 19, 2024

తెలుగు ప్రజల పట్ల, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన `కక్షపూరిత’ ధోరణిని మరోసారి వెల్లడి చేసుకుంది. తాజా బడ్జెట్ లో ఎటువంటి అనుమతులూ లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా గుర్తింపునిచ్చి, కేంద్ర బడ్జెట్లో రూ. 5,300 కోట్ల నిధులు కేటాయించడం రాయలసీమ ప్రాంతానికి గొడ్డలిపెట్టు వంటిది. మరో మూడు నెలలో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్పష్టం అవుతుంది.

దీన్ని కోర్టు ధిక్కార చర్యగా కూడా పరిగణించాలని ఏపీ సాగునీటి నిపుణుడు టి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ అన్యాయంపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గాని, ఆయన మంత్రులు గాని, రాయలసీమలోని ప్రజా ప్రతినిధులు గాని స్పందించక పోవడం విస్మయం కలిగిస్తుంది. పైగా, బడ్జెట్ ఎంతో బాగుందని రాయలసీమకు చెందిన ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కితాబు ఇవ్వడం సీమ ప్రజలకు ద్రోహం చేయడమే కాగలదు.

నేడు అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కృష్ణా నదీ జలాల్లో కర్ణాటకకు కేటాయించిన నికర జలాల వినియోగానికి కర్ణాటక రాష్ట్రం నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించుకొన్నది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఆ కేసు విచారణలో ఉండడంతో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో ఇంకా అమలులోకి రాలేదు. అటువంటి అమలులోలేని ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన 30 టియంసిల సామర్థ్యంతో ఎగువ భద్ర ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడం తెలుగు ప్రజలను వంచించటమే కాగలదు.

పైగా,  దాని నిర్మాణ అంచనా వ్యయం రు.16,125 కోట్లు. మోదీ  ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్లో రు.5,300 కోట్లు కేటాయించింది. జాతీయ ప్రాజెక్ట్ గా పార్లమెంట్ నిర్ధారించిన పోలవరంకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులను కూడా కేంద్రం ఇవ్వడం లేదు.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండగా, నికర జలాల కేటాయింపులేని ప్రాజెక్టుకు సి.డబ్లు.సి. ఎలా అనుమతిస్తుంది? కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జాతీయ ప్రాజెక్టుగా ఎలా ప్రకటిస్తుంది? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్లో రు.5,300 కోట్లు ఎలా కేటాయిస్తారు? అని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

కాగా, తక్షణం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయించాలని డిమాండ్‌ చేస్తూ  రాజకీయాలకతీతంగా ఐక్యంగా పోరాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని  ‘అప్పర్‌ భద్ర నిర్మాణం-జిల్లా నీటి వనరులకు ప్రమాదం’ అనే అంశంపై ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపిచ్చింది.

ఈ సమావేశానికి వైసిపి, బిజెపి మినహా టిడిపి, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసి, కాంగ్రెసు పార్టీల నాయకులతోపాటు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఐద్వా, డివైఎఫ్‌ఐ నాయకులు హాజరయ్యారు.  టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడానిు బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆనాడే వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles