ముఖ్యమంత్రి జగన్.. కేవలం తన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే పార్టీని మళ్లీ గెలిపించి తిరుగులేని మెజారిటీతో అధిాకారంలోకి తెస్తాయని నమ్ముతూ ఉంటారు. సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఎంత మేర ఉన్నదో.. తతిమ్మా వ్యవహారాల విషయంలో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటినీ విడిగా చూడడం తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై ఉండే జగన్మోహన్ రెడ్డికి సాధ్యం అవుతుందో లేదో గానీ.. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో ప్రజల మధ్య తిరుగుతూ ఉండే ఎమ్మెల్యేలకు బాగానే అర్థమవుతుంది. మంచి చెడులు వారికి అర్థమవుతాయి.
అయితే ఇంకో కోణంలోంచి పరిణామాల్ని గమనిస్తున్ననప్పుడు.. రాష్ట్రంలో చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన సిటింగ్ ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో తాము పోటీచేయకుండా తప్పుకుంటాం అని అంటున్నారు. ప్రస్తుతం 151గా ఉన్న తమ సంఖ్యాబలాన్ని 175కు తీసుకువెళ్లాలని ఒకవైపు జగన్ అంటోంటే.. పోటీకి వేరేవాళ్లని చూసుకోండి మహాప్రభో అన మాటలు పలువురు ఎమ్మెల్యేలనుంచి వినిపిస్తున్నాయి. పోటీకి విముఖంగా ఉన్నట్టు బహిరంగంగా చెబుతున్న వారు కొందరైతే.. పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చేసి.. సైలెంట్ గా ఉండిపోతున్నారు. అయితే పోటీ వద్దని అనుకుంటున్న ఎమ్మెల్యేలకు రకరకాల కారణాలు ఉండడమూ జరుగుతోంది.
తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కూడా ఇలా తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. సొంత పార్టీకే చెందిన ఒక నాయకుడు.. గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను నిలదీసి దారుణంగా ప్రశ్నించేసరికి.. తాత్కాలిక ఆవేశంలో, ఎమ్మెల్యే సుధాకర్ ఆ మాట అన్నారో లేదా, 2024లో పోటీచేయకూడదని ముందునుంచి ఫిక్సయి ఉన్నారో తెలియదు. మొత్తానికి పోటీచేయనని మాత్రం ప్రకటించారు. సొంత పార్టీ నేత ‘మీరు నమ్మకద్రోహి, మీకోసం పనిచేస్తున్న వాళ్లని పక్కన పెట్టారు.. రౌడీ మూకలను ప్రోత్సహిస్తున్నారు.. ఇంత నమ్మకద్రోహం నేను జీవితంలో చూళ్లేదు.. దీనికి మూల్యం చెల్లిస్తావు’ అని జనం ముందు నిందిస్తే బహుశా ఎమ్మెల్యే ఆగ్రహంలో ఈ మాట అన్నారని అనుకోవచ్చు.
కానీ ఇతర కారణాలు చూపించి.. వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయం అని చెబుతున్న నాయకులు చాలా మందే ఉన్నారు. తిరుపతి భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా తమ వారసులను ఈ ఎన్నికల్లోనే ఎమ్మెల్యేలుగా బరిలోకి దించాలని అనుకుంటున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ వద్ద ఇదే ప్రతిపాదన పెట్టారు. జగన్ దోరణులు నచ్చక, పార్టీని వీడిపోతే వేరే గత్యంతరం లేక, వారసులకు అప్పగించేసి.. తాము సైలెంట్ గా ఉండాలని కొందరు భావిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆనం చెప్పినట్టుగా ప్రజల్లో ప్రతికూల వాతావరణం ఉందని జంకి, పోటీకి వెనుకాడుతున్న వారు మరికొందరు. ఇలా కారణాలు ఏమైనప్పటికీ చాలా మంది పోటీచేయాలని అనుకోవడం లేదు.
175 సీట్లు గెలిచి తీరుతాం అని పదేపదే ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గెలిచే సంగతి తర్వాత.. కనీసం ప్రస్తుతం ఉన్న 151 మంది ఖచ్చితంగా మళ్లీ బరిలో ఉంటారు అని చెప్పగల స్థితిలో ఉన్నారు. పార్టీమీద, ప్రస్తుత ఎమ్మెల్యేల మీద ఆయనకు ఆ మాత్రం పట్టు, నమ్మకం ఉన్నాయా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది.
పోటీకి భయపడ్తున్న ఎమ్మెల్యేలు.. జగన్ కు లెక్కతెలుసా?
Monday, December 23, 2024