బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో రోజు రోజుకు మెరుగుదల కనిపిస్తున్నట్లు కుటుంభం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు సోమవారం రాత్రి హెల్త్ బులిటెన్ లో తెలిపారు.
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెబుతూ తారకరత్నకు ఎలాంటి ఎక్మో పెట్టలేదని.. ఎక్మో పెట్టారనేది ప్రచారం మాత్రమే అని కొట్టి పారేశారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని డాక్టర్లు బులెటిన్‌లో వివరించారు.
అయితే, తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని ఆయన బాబాయ్ నందమూరి రామకృష్ణ సోమవారం మధ్యాహ్నం వెల్లడించారు. గుండె, కాలేయం పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నట్టు తెలిపారు. అయితే, న్యూరో విషయంలో కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వివరించారు.
త్వరలోనే తారకరత్న మామూలు మనిషిగా బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నింటికన్నా శుభపరిణామం ఏమిటంటే, తారకరత్న తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నాడని తెలిపారు. ఇది తమకు చాలా సంతోషం కలిగించిందని చెప్పారు.
ఇలా ఉండగా, తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నందమూరి బాలకృష్ణ అంతకు ముందు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని కోరుతూ ఆరోగ్య పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంది పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని.. రెండుసార్లు తారకరత్న శరీరంపై గిచ్చితే.. ఓసారి స్పందించారని వివరించారు.
చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మరోవంక, తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. తారకరత్నను కాపాడిన వైద్యులు, దేవుడికి చిరు కృతజ్జతలు తెలిపారు.