టిఆర్ఎస్ ఎంపీలు ఇప్పటివరకు పార్లమెంట్ లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం వరకే పరిమితమవుతూ వస్తున్నారు. ఎప్పుడో ఒకసారి జాతీయ అంశాలపై గళం విప్పుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మొదటిసారిగా, బిఆర్ఎస్ ఎంపీలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాబోతున్నారు. దానితో భిన్నమైన పాత్ర వహించేందుకు సిద్దపడుతున్నారు.
ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలపై పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారిగా పార్లమెంట్ లో జరిపే ప్రసంగాన్ని బహిష్కరించాలని, హాజరుకావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎడగట్టాలని ఎంపీలకు కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలపై ఎప్పటిలాగే రాజీలేని పోరాటం కొనసాగిస్తూనే జాతీయ అంశాలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గవర్నర్ల తీరుపై పార్లమెంట్ సమావేశాల్లో గళం విప్పాలని పార్టీ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. కేవలం తెలంగాణాలో మాత్రమే కాకుండా, బిజెపియేతర ప్రభుత్వాలున్న తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలపై స్వారీ చేయడానికి గవర్నర్లు చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టేందుకు సిద్దపడుతున్నారు.
ప్రధానంగా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను నెలల తరబడి తిరిగి పంపకుండా గవర్నర్లు తమవద్ద అట్టిపెట్టుకోవడం పట్ల దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రవేశాలను పార్లమెంట్ లో ప్రతిబింబించాలని కేసీఆర్ సూచించారు. బిల్లులపై సంతకం పెట్టడానికి ఇష్టం లేనిపక్షంలో, తిరిగి పంపాలని, ఆ విధంగా కూడా చేయకుండా దీర్ఘకాలం తమవద్దనే ఉంచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం 11 మంది ఎమ్యెల్సీల నామినేషన్లకు సంబంధించి పంపిన ఫైల్ ను ఆ ప్రభుత్వం పడిపోయేవరకు గవర్నర్ క్లియర్ చేయకుండా ఉండడాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా శాసనసభలలో, రిపబ్లిక్ డే వంటి కార్యక్రమాలలో మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాలను కాదని, సొంత ప్రసంగాలు చేయడం పట్ల కూడా పార్లమెంట్ లో నిలదీయాలని సిద్దపడుతున్నారు.
బిఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించడంతో, దేశ ప్రజలను కలవరంకు గురిచేస్తున్న సమస్యలను ప్రస్తావించడమా ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రపతి ప్రసంగంకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, కేంద్ర బడ్జెట్ పై జరిగే చర్చలను సద్వినియోగం చేసుకొనేందుకు సిద్దపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను కలుపుకుని పోరాడేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు పార్లమెంట్ ను ఓ వేదికగా మలచుకోవాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఆదేశించారు.