ప్లేసు మారితే గట్లుంటది సీబీఐ తోని!

Friday, December 5, 2025

కడపజిల్లాలో కొలువుతీరి విచారణ జరిగినంత కాలం వారికి రకరకాల బెదిరింపుల, ఆటంకాలు తప్పలేదు. అసలు కేసు ముందుకు నడుస్తున్నదా? వెనక్కు నడుస్తున్నదా? అనే అనుమానాలు పలువురికి వచ్చాయి. వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంలో పిటిషన్ వేసి.. కేసు విచారణను ఏపీనుంచి తెలంగాణకు మార్చిన తర్వాత.. సీబీఐ వేగం పుంజుకున్నట్లుగా, స్వేచ్ఛగా దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వివేకా హత్యకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఒకసారి ప్లేసు మారగానే.. సీబీఐతో వ్యవహారం వేగం పెరిగిందని పలువురు అంటున్నారు.
మంగళవారం నాడు హైదరాబాదులో సీబీఐ విచారణకు హాజరు కావల్సిందిగా ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వలన మంగళవారం హాజరు కాలేనని, అయిదు రోజుల తర్వాత ఎప్పుడు చెప్పినా హాజరు అవుతానని సీబీఐ అధికార్లకు సమాచారం ఇచ్చారు. దీంతో మరో వారం రోజుల్లోగా అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించడం అనేది ఖరారైంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక, కడప ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అప్రూవర్ గా మారిన దస్తగిరి వెల్లడించిన మేరకు కూడా.. ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లాంటి పెద్దలు ఉన్నారని ప్రచారం జరిగింది. వారున్నారు కనుక ఇబ్బంది లేదని అయిదు కోట్లరూపాయలు ఇస్తామని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్లుగా దస్తగిరి సీబీఐ అధికార్లతో అన్నారు.
వివేకానందరెడ్డి హత్య వెనుక అవినాష్ హస్తం ఉన్నట్టుగా సీబీఐ చార్జిషీటులో కూడా నమోదుచేసింది. సీబీఐ అధికారులు కడప కేంద్రంగా విచారణ సాగించినంత కాలం వారికి అనేక బెదిరింపులు వచ్చాయి. తన అనుచరుడు శివశంకర్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారంటూ కోర్టులోనే అధికార్లను అవినాష్ రెడ్డి గట్టిగా నిలదీయడమూ చర్చనీయాంశం అయింది. వేరే సందర్భంలో కోర్టునుంచి బయటకు వస్తున్న సీబీఐ అధికార్లను అవినాష్ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడం కూడా వివాదాస్పదం అయింది. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు విచారణ హైదారాబాదుకు మారిన తర్వాత.. కేసులో ఎంతో కీలకంగా భావిస్తున్న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలవడం సంచలనంగా ఉంది.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles