టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అగ్గిమీద గుగ్గిలంగా ఉంటూ, అతను ఉన్నంతకాలం గాంధీ భవన్ లో అడుగుపెట్టానని భీష్మించుకుని కూర్చున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం అనూహ్యంగా ఎట్టకేలకు గాంధీభవన్ మెట్లెక్కారు.పైగా, రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని, ఇద్దరు గుసగుసలాడుకోవడం కాంగ్రెస్ సీనియర్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తమ్ముడు రాజగోపాలరెడ్డి పార్టీకి రాజీనామా చేసి, మునుగోడు ఉపఎన్నికకు కారణమైనప్పుడు కాంగ్రెస్ కు ప్రచారం చేయక పోవడమే కాకుండా, ఓడిపోతుందని అంటూ ప్రకటించడం, పరోక్షంగా తమ్ముడికి సహకారం అందించడంతో ఏఐసీసీ షోకాజ్ నోటిస్ కూడా జారీచేసింది. చివరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యీత్ర తెలంగాణాలో జరుగుతున్నప్పుడు కూడా పాల్గొనలేదు.
తమ్ముడి బాటలో త్వరలో తాను కూడా బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా రేవంత్ రెడ్డితో మంతనాలు జరపడమే కాకూండా ఇక పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటానని కూడా ప్రకటించారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌చార్జిగా కొత్తగా వచ్చిన మాణిక్ రావ్ ఠాక్రే నిర్వకంగా కొందరు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ ను పక్కకునెట్టి, ప్రధాన ప్రతిపక్షం కావడం ద్వారా బిఆర్ఎస్ కు ప్రధాన సవాల్ గా మారాలని ప్రయత్నిస్తున్న బిజెపి కాంగ్రెస్ నాయకులకు చాలాకాలంగా గాలం వేస్తున్నారు.
అయితే, రాష్ట్ర బీజేపీలోని ముఖ్యనేతలు అందరూ ఇతర పార్టీల నుండి వచ్చిన నేతల పట్ల అసహనంతో వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి ఎటువంటి బలంలేని బిజెపి నాయకులు బలమైన నాయకులు ఇతర పార్టీల నుండి వస్తే తమ ఉనికి ప్రమాదకరంగా భావిస్తున్నారు.
అందుకనే, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎన్నికల్లో ఓటమి చెందేందుకు వీరంతా కూడబలుక్కొని కుట్రపూరితంగా పనిచేశారని ఇప్పుడు తెలుస్తున్నది. రాజగోపాల్ రెడ్డి ఎమ్యెల్యేగా గెలిస్తే పార్టీలో ఆయన ప్రాబల్యం పెరిగి, వచ్చే ఎన్నికలలో పార్టీ సారధ్య బాధ్యతలు కూడా అప్పచెప్పవచ్చని, అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కావచ్చనే భయంతో ద్రోహం చేశారని గ్రహించారు.
ఈ విషయమై రాజగోపాలరెడ్డి నేరుగా అమిత్ షా కే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. తమ్ముడి పరిస్థితి చూసిన తర్వాత వెంకట్ రెడ్డి బీజేపీలో చేరే ఆలోచనను విరమించుకున్నారని, ఇక కాంగ్రెస్ లో ఉండి తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
పైగా, రాహుల్ యాత్రలో పాల్గొనకపోవడం, మునుగోడు ఉపఎన్నికలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో ఆగ్రహంగా పార్టీ అధిష్ఠానం ఉండడంతో, పార్టీలో పరిస్థితులు సర్దుబాటు చేసుకునేందుకు రేవంత్ రెడ్డితో కలసి పనిచేయక తప్పదని కూడా నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది.