గవర్నర్లు కేంద్రంలోని అధికారపక్ష ఏజెంట్ల మాదిరిగా రాజకీయ పాత్ర పోషిస్తుండటం మనదేశంలో కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం మోదీ హయాంలో గవర్నర్లు బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ఒక విధంగా చెప్పాలి అంటే బీజేపీకి `అధికార ప్రతినిధుల’ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ, ముఖ్యమంత్రుల పట్ల అసహనంతో వ్యవహరిస్తున్నారు.
చివరకు రాష్ట్ర శాసనసభ, మంత్రి మండలి ఆమోదించిన బిల్లులను సహితం సంతకాలు పెట్టకుండా, కనీసం తిరస్కరించకుండా లేదా వివరణలు కోరకుండా నెలల తరబడి పక్కన పెట్టేస్తున్నారు. అదేమంటే రాజ్యాంగంలో గవర్నర్ పరిశీలనకు నిర్ణీత సమయం లేదు కదా అంటూ వితండవాదనకు దిగుతున్నారు.
ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ బహిరంససభలో పాల్గొన్న ముఖ్యమంత్రులు గవర్నర్ల తీరుపై మండిపడ్డారు. బిజెపి నియమించిన గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. సీఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్లను మోదీనే ఆడిస్తున్నారని.. గవర్నర్లకు ఢిల్లీ నుంచి ఒత్తిడి ఉందని ఆరోపించారు.
తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని పేర్కొంటూ అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే గవర్నర్ల పని అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. గత ఏడాది కాలంగా తనను `గౌరవించడం’లేదని,, `ప్రోటోకాల్’ పాటించడంలేదని అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మరోసారి తన అక్కసును బహిరంగంగా వ్యక్తపరిచారు.
ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ మరోసారి గవర్నర్ వ్యవస్థ మీద వ్యాఖ్యలు చేయటంతో తమిళిసై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్లను సీఎం కేసీఆర్ అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను ముఖ్యమంత్రులు ఎలా అవహేళన చేస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రోటోకాల్పై సీఎం కేసీఆర్ స్పందించిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెప్తానని తమిళి సై స్పష్టం చేశారు.
రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నందుకు మిగతా రాష్ట్రాల సీఎంల వాఖ్యలపై తాను స్పందించబోనని అంటూనే ఆమె సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గవర్నర్‌ను అవమానించారని స్పష్టం చేశారు.
గవర్నర్లపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించిన తమిళిసై ఇది అహంకారం కాక ఇంకేంటని ప్రశ్నించారు.
తన కార్యాలయంలో ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే అని అంగీకరిస్తూ తమిళిసై.. బిల్లుల కంటే ప్రోటోకాల్ అంశం ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ముందుగా కేసీఆర్ ఆ విషయం తెలిస్తేగాని తాను బిల్లులపై స్పందించనని తేల్చి చెప్పారు. అంటే కేసీఆర్ కు `గుణపాఠం’గా ఉద్దేశపూర్వకంగా తాను బిల్లులను ఆపేసినట్లు ఆమె పరోక్షంగా అంగీకరించినట్లు అయింది.
కొంతకాలంగా ప్రగతి భవన్‌కు రాజ్ భవన్‌కు మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. అయితే, ఇటీవల రాష్ట్రపతి పర్యటన వేళ చాలా రోజుల తర్వాత ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. కానీ, ఆ వెంటనే రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి స్వాగత కార్యక్రమానికి కేసీఆర్ గైరజరయ్యారు.
ముందు నుంచి తనకు తెలంగాణ ప్రభుత్వం గౌరవం ఇవ్వట్లేదని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్నారు. ఏ విషయంలోనూ ప్రొటోకాల్ పాటించట్లేదని బహిరంగంగానే తన అక్కస్సును వెల్లగక్కుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వం పంపించిన బిల్లులను కావాలనే గవర్నర్ పెండింగ్‌లో పెట్టారంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాగా.. తనకలాంటి ఉద్దేశం ఏమీ లేదని, ప్రభుత్వమే తనపై కక్ష సాధిస్తోందంటూ ఆరోపిస్తున్నారు గవర్నర్.