జీవోను హైకోర్టు రద్దు చేయనేలేదు. ‘ప్రస్తుతానికి’ సస్పెండ్ చేస్తూ కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. 20వ తేదీ, అంటే రెండురోజుల వ్యవధిలో, మళ్లీ విచారణ కూడా జరగవలసి ఉంది. తాము తీసుకువచ్చిన జీవో చట్టసమ్మతమైనదే అయితే, రాజ్యాంగబద్ధమైనదే అయితే ప్రభుత్వం ఆ విషయాన్ని హైకోర్టులోనే ఆ విచారణ సందర్భంగా చాటిచెప్పడానికి పుష్కలంగా అవకాశం ఉంది. కానీ ఇంతలోనే జగన్ సర్కారుకు అసహనం ఎక్కువైంది. హైకోర్టు స్టే ఉత్తర్వుల మీదనే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త సంవత్సరం కానుకగా జీవో నెం.1 తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ జీవో ఆధారంగా ప్రతిపక్షాలు ఎలాంటి సభలు, రోడ్ షోలు నిర్వహించడానికి వీల్లేకుండా నిషేధాజ్ఞలు ఇచ్చేశారు. రాజకీయంగా ఈ జీవోనెం.1 మీద పెద్ద దుమారమే రేగుతోంది. తెలుగుదేశం, జనసేన కలిసి ఐక్యపోరాటం చేయాలని కూడా నిర్ణయించాయి. అదే సమయంలో సీపీఐ రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ జీవోను కోర్టు స్టే ఉత్తర్వులతో 23వ తేదీవరకు నిలిపివేసింది. 20న మరోసారి ఈ పిటిషన్ ను విచారించనుంది.
ఇంతలోనే జగన్ సర్కారు, హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. మూడురోజుల ముందు సుప్రీంలో పిటిషన్ వేయడం కంటె.. వీగిపోయేలా కాకుండా సమర్థమైన గట్టి వాదనలను తయారుచేసుకుని 20వ తేదీన హైకోర్టులో ఎదుర్కోవడమే మంచిది కదా అనే అభిప్రాయమూ పలువురిలో వ్యక్తం అవుతోంది. అయితే ఈ పిల్ విచారణ సందర్భంగా.. హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఎక్కువ అసహనానికి గురైనట్టుగా అనిపిస్తోంది.
75 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో ఇలాంటి జీవోలను ఎన్నడైనా చూశామా? అంటూ న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కేవలం సస్పెన్షన్ మాత్రమే అయినా.. తుదితీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకపోవచ్చునని, కోర్టు ఏకంగా జీవోను రద్దు చేయవచ్చునని కూడా ఊహాగానాలు ఉన్నాయి. అదే జరిగితే గనుక.. ప్రభుత్వానికి మరింతగా పరువు పోతుంది. పైగా కొత్త సంవత్సరంలో తెచ్చిన మొదటి జీవోనే రద్దయితే.. సెంటిమెంట్ పరంగా కూడా అపశకునం అనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే సుప్రీం ఈ విషయంలో ఏం చెబుతుందో వేచిచూడాలి.
అసహనం తాళలేకపోతున్న జగన్ సర్కార్!
Monday, December 23, 2024