ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి దశ నుండి రాజకీయ ప్రత్యర్థిగా అంటున్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పేరుపెట్టి విమర్శలు చేయడం లేదు. చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత చిత్తూరు జిల్లా కాంగ్రెస్ లో పెద్దిరెడ్డి కీలక నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఒక వంక రాష్ట్రస్థాయిలో వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రత్యర్థివర్గంగా ఉంటూనే, జిల్లాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండేవారు.
చంద్రబాబు నేతృత్వంలో టిడిపి రాష్ట్ర స్థాయిలో ఎన్ని విజయాలు సాధిస్తూ వచ్చినా చిత్తూరు జిల్లాలో మాత్రం కాంగ్రెస్ బలంగా ఉంటూ ఉండెడిది. కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో ఇద్దరు, ముగ్గురు మినహా అందరూ పెద్దిరెడ్డితోనే ఉండేవారు. ఇక వైసిపి నేతగా జిల్లాలో ఆయనను కాదని సీఎం జగన్ మోహన్ రెడ్డి సహితం అడుగువేయలేని పరిస్థితి నెలకొంది.
వైసీపీ వచ్చినప్పటి నుండి కుప్పంపై దృష్టి సారిస్తూ వస్తున్నారు. అక్కడ చంద్రబాబును బలహీనుడిని చేసే బాధ్యతను చేపట్టిన పెద్దిరెడ్డి గత మున్సిపల్ ఎన్నికలలో టిడిపికి చుక్కలు చూపించారు. ఆ ఊపుతోనే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో చంద్రబాబును కూడా ఓడిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. సీఎం జగన్ సహితం “వై నోట్ 175.. కుప్పంతో సహా” అంటూ చెబుతున్నారు.
మునిసిపల్ ఎన్నికలలో దౌర్జన్యాలకు పాల్పడి టిడిపిని దెబ్బతీసిన వైసిపి సవాల్ ను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు తనదైన వ్యూహంతో పనిచేస్తున్నారు. అటువంటి సమయంలో తన పర్యటన సమయంలో పోలీసులు అడుగడుగునా అడ్డుతగలడమే కాకుండా, ఈ సందర్భంగా దాడులకు గురైన టిడిపి కార్యకర్తలపై దొంగకేసులు నమోదు చేసి, అరెస్టులు చేయడం సహింపలేక పోయారు.
ముఖ్యంగా పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 100 మంది టిడిపి కార్యకర్తలను కేసులలో ఇరికించి, జైలుపాలు చేయడంతో ఆగ్రహంతో పెద్దిరెడ్డికి మొదటిసారిగా పేరుపెట్టి హెచ్చరికలు చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎక్కడ ఉంటావో చూసుకో అంటూ హెచ్చరించారు. బహుశా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత ఘాటుగా ఏ నాయకుడిని చంద్రబాబు హెచ్చరించి ఉండలేదు.
సంక్రాంతి రోజునే జైలుకు వెళ్లి, టిడిపి కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓటమి పాలు చేస్తానంటూ సవాల్ విసిరారు. కుప్పం పర్యటనలో పొలిసు అడ్డంకులను ఎదుర్కొన్న చంద్రబాబులో ఎన్నడూ ఎరుగని కారకుతనం వెల్లడి అవుతుంది. చిత్తూరు జిల్లాలో ఈ సారి మెజారిటీ స్థానాలు గెలవాల్సిందే అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి పెద్ది రెడ్డి తమ పార్టీ అధినేత, సీఎం వైఎస్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. పెద్దిరెడ్డి ప్రకటన చూసినవారికి చంద్రబాబు ఉచ్చులో పడుతున్నాడా? అనే అనుమానం కలుగుతుంది. చంద్రబాబు హెచ్చరికలకు రెచ్చిపోయి, స్వయంగా వెళ్లి కుప్పంలో పోటీచేస్తే ఓ విధంగా మిగిలిన నియోజకవర్గాలపై నుండి దృష్టి మళ్లించినట్లు అవుతుంది.
తాను కుప్పంలో పోటీ చేసి నెగ్గడానికి సిద్ధంగా ఉన్నానని అంటూనే మరి చంద్రబాబు పుంగనూరులో తనపై పోటికి సిద్దామా అంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు. రెండు చోట్లా పోటికి తాను సై అంటూ స్పష్టం చేశారు. చివరకు చంద్రబాబు – పెద్దిరెడ్డిల మధ్య మాటల యుద్ధం ఏపీలో ఎన్నికలకు చాలా ముందుగానే వేడిని పెంచుతున్నది.