ఎర్ర గంగిరెడ్డి రాష్ట్రంలోనే ఇప్పటికీ సంచలనంగా ఉన్న నాలుగేళ్ల కిందటి హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఎందరు వాంగ్మూలాలు ఇస్తున్నా.. అన్నింటిలోనూ ఆయన పాత్ర కనిపిస్తూ ఉంది. ఆయన మాత్రం స్వేచ్ఛగా బెయిలుపై బాహ్యప్రపంచంలోనే తిరుగుతున్నాడు. సాక్షులను ప్రభావితం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయినా బెయిల్ రద్దుకు గతంలో హైకోర్టు తిరస్కరించింది. కానీ, తాజాగా సుప్రీం కోర్టు తిరిగి తెలంగాణ హైకోర్టుకు ఆ పిటిషన్ ను బదిలీచేసిన నేపథ్యంలో బెయిల్ రద్దు జరిగే అవకాశం ఉందా అని చర్చలు సాగుతున్నాయి.
ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, వైఎస్సార్ కు స్వయానా తమ్ముడు అయిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఏపీ పోలీసులు 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేశారు. ఆ వెంటనే ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. పోలీసులు నిబంధనల ప్రకారం 90 రోజుల్లో అంటే జూన్ 28 లోగా చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలం కావడంతో పులివెందుల కోర్టు ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
ఆ తర్వాత కేసు సీబీఐ చేతికి వెళ్లడం, వారి చార్జిషీట్ లో ఏ1గా ఎర్ర గంగిరెడ్డి పేరుండడం జరిగింది. అయితే బెయిలు మాత్రం రద్దు కాలేదు. ఒకసారి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చాక, మెరిట్స్ ఆధారంగా రద్దు కుదరదని హైకోర్టు చెప్పింది. దీనిపై సుప్రీంను సీబీఐ ఆశ్రయించింది. తాజాగా ఒకసారి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చినా సరే.. తర్వాత మెరిట్స్ ను బట్టి రద్దు చేయకూడదని అనుకోవడం కరెక్టు కాదని, మెరిట్స్ పరిశీలించి బెయిల్ రద్దు చేయవచ్చునని సుప్రీం కోర్టు పేర్కొంది. అందువల్ల మళ్లీ విచారించాల్సిందిగా ప్రస్తుతం వివేకా హత్యకేసు విచారణ ఉన్న తెలంగాణ కోర్టుకు ఆ పిటిషన్ ను బదిలీ చేసింది.
ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు కొన్ని గమనించదగ్గవి..
ఒకసారి చార్జిషీట్ దాఖలు ఆలస్యం కారణంగా డిఫాల్ట్ బెయిల్ ఇస్తే..తర్వాత రద్దు కుదరదని తేల్చేస్తే గనుక.. నిందితులు పోలీసులను వ్యవస్థలను మేనేజ్ చేసుకుని లబ్ధి పొందే అవకాశం ఉన్నదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సరిగ్గా ఎర్రగంగిరెడ్డి విషయంలో రాష్ట్రంలో అధికార మార్పు జరిగిన తర్వాత.. పోలీసులు చార్జిషీటు వేయడంలో విఫలం కావడం గమనించాల్సిన విషయం. వివేకానందరెడ్డి హత్య కేసులో.. జగన్ సోదరుడు అవినాశ్ రెడ్డి పాత్ర గురించి అనేక వాదనలు ఉండడం, వారిని కాపాడడానికి పెద్దస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు ఉన్న నేపథ్యంలో.. కేవలం చార్జిషీట్ దాఖలు ఆలస్యం కారణంగా వచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు గురించి అవకాశమే లేదనడం విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తుంది అన్నట్టుగా సుప్రీం చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. బెయిల్ రద్దును తిరస్కరించిన ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం రద్దు చేయగా, మళ్లీ తెలంగాణ హైకోర్టుకు రావడం వలన ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఎంత?
Monday, December 23, 2024