మరొక రెండు రోజుల్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ జరగబోతోంది. ఖమ్మంలో సుమారు అయిదులక్షలమందితో ఈ సభ అట్టహాసంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి సభకు హాజరవుతున్న సంగతి ఖరారైంది. ఆవిర్భావ సభతోనే మోడీ మీద పెద్దఎత్తున యుద్ధానికి శంఖారావం పూరించాలని కేసీఆర్ ఉత్సాహపడుతున్నారు. అయితే ఈ సభకు మరింత హైప్ తీసుకురావడానికి కొత్తగా కొన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యనాయకులను పార్టీలో చేర్చుకోవడానికి కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రధానంగా తెలుగురాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. నిజానికి ఖమ్మంలో చంద్రబాబు నాయుడు సభ నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. దాని వెంబడి గులాబీ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడిపోతారనే ప్రచారాలు కూడా ఆ పార్టీలో మరో కలకలానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో అదే ఖమ్మం నుంచి జాతీయ పార్టీ ఆవిర్భావ సభతో శంఖం పూరిస్తే.. పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల్లో కూడా ప్రతిధ్వనిస్తుందని కేసీఆర్ ఆశపడుతున్నారు. అందుకే ఆయారాష్ట్రాలనుంచి ఈ సభలో కొత్తగా చేరికలు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
ఏపీ భారాస అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులు అయిన నాటినుంచి ఆయన ఇతర పార్టీలనుంచి నాయకులను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. జనసేనతో ఉన్న విస్తృత పరిచయాల దృష్ట్యా ఎక్కువగా వారి మీదనే తోట చంద్రశేఖర్ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో పనిలేకుండా ఖాళీగా ఉన్న కొందరు నాయకులతో కూడా తోట చంద్రశేఖర్ టచ్ లోకి వెళ్లి భారాసలో చేరాల్సిందిగా ఆఫర్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఒదిశా భారాస అధ్యక్షుడిగా కేసీఆర్ గిరిధర్ గమాంగ్ ను నియమించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన 79ఏళ్ల గమాంగ్ అక్కడ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపించగలరో తెలియదు. ఆయన కూడా కొందరు ముఖ్యనాయకులనైనా తీసుకురాగలరని, వారిని ఖమ్మం సభలోనే భారాసలో చేర్చుకోవాలని కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ పొరుగు రాష్ట్రమే గనుక.. అక్కడనుంచి కూడా నాయకుల చేరికలు ఉండాలనుకుంటున్నారు.
వివిధ రాష్ట్రాలనుంచి ఎంత ఎక్కువ మంది వచ్చి భారాసలో చేరితో అంతగా తమ పార్టీ ప్రాభవం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని కేసీఆర్ అనుకుంటున్నారు. మరి ఆయన చేరికల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.
గులాబీ డైరీస్ : కొత్తవాళ్లను ఆకర్షించండి!
Saturday, November 16, 2024