ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్నాయని, ఎక్కడ సభలు పెట్టినా అంచనాలకు మించి జనం వస్తున్నారని, వైసీపీ శ్రేణులలోనే తమ పార్టీ ప్రభుత్వం తీరు పట్ల అసంతృత్తి వ్యక్తం అవుతున్నదని టిడిపి శ్రేణులు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుస్తామని, ఏపీలో వచ్చెడిది తమ ప్రభుత్వమే అని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుండి అందరూ భరోసా వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటికే పలు నియోజకవర్గాలలో అసెంబ్లీకి అభ్యర్థులను ఖరారు చేసి, బహిరంగసభలోనో లేదా సమీక్షా సమావేశంలోనో చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఇదివరలో నామినేషన్ వేయడానికి గడువుకు చివరి రోజు వచ్చేవరకు అనేక నియోజకవర్గాలలో తేల్చే వారు కారు. అయితే పలు లోక్ సభ నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో అస్పష్టత నెలకొంటున్నది.
కనీసం సగం నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు లేరని అంచనాకు వస్తున్నారు. లోక్ సభ అభ్యర్థి అంటే తన నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల ఖర్చులో కూడా సింహభాగం భరించడం టిడిపిలో కొంతకాలంగా ఆనవాయితీగా వస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం లేకపోవడం, కేంద్రంలో కూడా అనుకూల ప్రభుత్వం లేకపోవడంతో భారీగా నిధులు ఖర్చుపెట్టగల వారు ముందుకు రావడం లేదు.
ముఖ్యంగా కేంద్రం ఐటీ, ఈడీ దాడులకు దిగవచ్చని పలువురు సంపన్నులు ఎన్నికలలో పోటీకి వెనుకడుగు వేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు పలువురు టిడిపి అభ్యర్థులు, నాయకులపై అటువంటి దాడులు జరగడం గమనార్హం.
ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు పార్టీకి ఉన్నారు. వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గానికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆయన వచ్చేసారి పోటీ చేయడం అనుమానంగా భావిస్తున్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని సహితం తిరిగి పోటీచేయడంపై వివాదం నడుస్తున్నది.
ఇక రెండు సార్లు గెలుపొంది, మూడోసారి గెలుపొందడం కూడా ఖాయం అనుకొంటున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ సారి ఎమ్యెల్యేగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నాడు. నేరుగా చంద్రబాబు నాయుడుతోనే తన మాట చెప్పారు. ఈ విషయం ఓ విధంగా చంద్రబాబును రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తున్నది.
మరోవంక, గతంలో లోక్ సభకు పోటీ చేసిన పలువురు ఈ సారి అసెంబ్లీలో పోటీ చేయడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. దానితో ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల అన్వేషణ ఇబ్బందికరంగా ఉంటుంది. పోటీకి చాలామంది ముందుకు వస్తున్నా సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయడం సమస్యాత్మకంగా మారే సూచనలు ఉన్నాయి.
పార్టీ వర్గాల ప్రకారం విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నరసరావుపేట, బాపట్ల నెల్లూరు, తిరుపతి, రాజంపేట, కర్నూల్ తదితర నియోజకవర్గాలలో అభ్యర్థుల కోసం అన్వేషింపవలసిన పరిస్థితి నెలకొంది.