హిమాచల్ నిర్ణయంతో జగన్‌కు గడ్డురోజులు!

Monday, December 23, 2024

‘పృష్ట తాడనాత్ దంత భంగః’ అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపు మీద తంతే మూతి పళ్లు రాలుతాయని దాని అర్థం. అలాగే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావంలో ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద పడే అవకాశం కనిపిస్తోంది. అవునుమరి.. అలవిమాలిన హామీలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరోసారి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కారు తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిద్వారా 1.36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.ఒక రాష్ట్రప్రభుత్వం పాత పెన్షన్ విధానానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీలో అదే డిమాండ్ ను చాలా రోజులుగా వినిపిస్తున్న ఉద్యోగులు మరోసారి రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయంగా కొత్త పెన్షన్ పథకం ఇస్తానంటూ జగన్ మోహన్ రెడ్డి సర్కారు చాలా కాలంగా ఉద్యోగులకు నచ్చజెబుతుండగా.. ఉద్యమాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం వారి పోరాటానికి ఆజ్యం పోసే అవకాశం ఉంది.
ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే పాత పెన్షన్ విధానాన్ని తొలగించారు. అయితే జగన్ 2019 ఎన్నికలకు ముందు.. తాను ఎన్నికల్లో గెలిస్తే పాత పెన్షన్ విధానం తిరిగి తీసుకవస్తానంటూ మాట ఇచ్చారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత గానీ.. ఆయనకు అందులో ఉన్న భారం తెలిసిరాలేదు. అసలే రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. పాత పెన్షన్ విధానం తీసుకురావడం అనేది ఆత్మహత్యాసదృశం అవుతుందనే సంగతి ఆయనకు అర్థమైంది. ఈ విషయంలో మాట తప్పారు. ఉద్యోగ సంఘాలు మాత్రం.. జగన్ మాట ఇచ్చారనే సంగతి పట్టుకుని పోరాటాలు ప్రారంభించాయి. ఉద్యోగ వర్గాలను మోసగించారంటూ ఉద్యమించడం ప్రారంభించాయి. ప్రభుత్వం పాత పెన్షన్ విధానం కాకుండా.. మధ్యేమార్గంగా తాము ఒక విధానం తయారుచేసి దాని ప్రకారం పెన్షన్లు ఇస్తామని నచ్చజెప్పినప్పటికీ.. ఉద్యోగులు శాంతించలేదు. ప్రతిసారీ ఉద్యోగులతో చర్చల్లో ఈ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతూనే ఉంది.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కారు పాత పెన్షను విధానాన్ని పునరుద్ధరించింది. ఇదే ప్రధాన హామీగా వారు ఎన్నికల్లో పోటీచేశారు. అధికారంలోకి రాగానే చేస్తాం అన్నారు. మొత్తానికి కొంత ఆలస్యం అయినా.. పాత పెన్షను విధానం తిరిగి తెచ్చారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనేపథ్యంలో ఏపీలో పాత పెన్షను విధానం కోసం పోరాడుతున్న వారు మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. ఓట్ల కోసం అలవిమాలని వాగ్దానం చేసిన జగన్ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles