జగన్ కోర్టుకు రావాల్సిందే.. నోరు విప్పాల్సిందే!

Monday, December 23, 2024

‘కోడికత్తి కేసు’ అనేది తెలుగురాష్ట్రాల్లో ఒక కామెడీ పదప్రయోగం అయిపోయింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నంలో ఉన్న అత్యంత బలమైన నాయకుడిని, ఒక కుర్రవాడు.. అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండే విమానాశ్రయంలో, అతి చిన్నదైన కోడికత్తితో గాయపరచి హత్య చేయాలని అనుకోవడమే ఆశ్చర్యంగా అనిపించే విషయం. అయితే ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్మోహన్ రెడ్డిమీద అలాంటి దాడి జరిగింది. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఆ దాడిని ఆయన చాలా బాగా రాజకీయానికి వాడుకున్నారు. తన మీద జరిగిన రాజకీయ హత్యాప్రయత్నంగా దానికి రంగు వచ్చేలా చూసుకున్నారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదంటూ.. అక్కడినుంచి హైదరాబాదు వచ్చి కేసు పెట్టి, చికిత్స చేయించుకున్నారు.ఆ కుర్రాడిని అరెస్టు చేసి జైల్లోపెట్టారు.
నాలుగున్నరేళ్లుగా ఈ కేసు తేలలేదు. ‘హత్య’కు యత్నించిన వాడు ఇన్నాళ్లుగా రిమాండులోనే ఉన్నాడు. తనను చంపడానికి ప్రయత్నించారనే సానుభూతిని ప్రజల్లో కలిగించగలిగిన జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయినా ఈ కేసు ఇప్పటిదాకా తేలనేలేదు. తాజాగా నిందితుడు శ్రీనివాసరావుకు ఏడోసారి బెయిలు తిరస్కరించిన ప్రత్యేక కోర్టు.. విచారణకు షెడ్యూలు ఖరారు చేస్తోంది. త్వరలోనే ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువస్తారన్నమాట. అయితే ఈ సందర్భంగా కోర్టుచేసిన వ్యాఖ్యలు గమనించాల్సి ఉంది.
విచారించాల్సిన సాక్షుల జాబితాలో.. అసలు బాధితుడి పేరే లేకపోతే ఎలా? అంటూ కోర్టు విచారణాధికారులను ప్రశ్నించింది. ఏది ఏమైనప్పటికీ.. ఒక దాడి జరిగిందని అనుకున్నప్పుడు గాయపడిన వ్యక్తి.. దానికి తొలి సాక్షి. అయితే ఎన్ఐఏ , జగన్ పేరు లేకుండానే.. 12 మందిని విచారించాలంటూ కోర్టుకు జాబితా ఇచ్చింది. దీనిపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.
తమాషా ఏంటంటే.. జగన్ మీద హత్యాయత్నం జరిగింది.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ దురాగతానికి ఒడిగట్టారు.. అని బహుధా ప్రచారంలోకి వచ్చింది. కానీ జగన్ ఈ విషయంలో తాను నోరువిప్పి పెద్దగా మాట్లాడింది లేదు. దాడి చేసిన శ్రీనివాస్ గురించి గానీ, దాడి ఎలా జరిగిందనే విషయంలో గానీ.. ఆయన ఇప్పటిదాకా ఏమీ నోరు తెరచి చెప్పలేదు. ఇలాంటి నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలు కీలకం కాబోతున్నాయి. జగన్ స్వయంగా కోర్టుకు వచ్చి దాడి గురించి చెబితే.. ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. మానవ శరీరానికి లోతైన గాయం కూడా చేయలేని కోడికత్తితో, ఒక వ్యక్తి దాడిచేస్తే.. దానిని చంపడానికి జరిగిన ప్రయత్నంగానే ఆయన కూడా కోర్టు ఎదుట అభివర్ణిస్తారా? లేదా, మరో రకం అభిప్రాయం వెలిబుచ్చుతారా? అప్పట్లో పబ్లిసిటీ కోసమే అలాంటి పనిచేశానని చెప్పుకున్న శ్రీనివాసరావు జీవితం నాలుగున్నరేళ్లుగా రిమాండులో జైల్లోనే మగ్గిపోతుండగా.. ఆయన తన మాటలతో విముక్తి కల్పిస్తారా అనేది చూడాల్సి ఉంది. జగన్ కోర్టుకు వచ్చి నోరు తెరచి ఏం జరిగిందో చెప్పాల్సి ఉంటుంది.. అనేది ప్రజలకు ఆసక్తికరంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles