రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నమ్మకస్తుడిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ ను కేంద్రం పట్టుబట్టి, సుదీర్ఘ న్యాయ పోరాటం జరిపి, రాష్ట్ర హైకోర్టులో సానుకూల తీర్పు రాగానే క్షణాలలో రిలీవ్ చేసి, ఏపీకి మార్చడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఖంగుతిన్నారు. కేంద్ర ప్రభుత్వం డిఒపిటిని పురమాయించి మరో అడుగు వేయక ముందే రాష్ట్రానికి కొత్త డిజిపిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.
అదే జరిగితే, ఇన్ ఛార్జ్ గా డిజిపి పదవి పొందిన అంజనీ కుమార్ కు పక్షం రోజుల లోపుగానే నిరసయెదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమేశ్ కుమార్ మాదిరిగా అంజనీ కుమార్ కూడా బీహార్ కు చెందిన వ్యక్తి కావడంతో కేంద్రం పట్టుబట్టి వెంటపడే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.
కేంద్రం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఉండకుండా తమకు నచ్చి న రాష్ట్రాల్లో పనులు చేస్తున్న మరో 15 మంది ఐఎఎస్, అధికారులపై తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రభావం చూపనున్నది. ప్రస్తుతం ఇన్‌చార్జి డిజిపిగా ఉన్న అంజనీకుమార్ కూడా ఎపి క్యాడర్ ఐపిఎస్ అధికారి అయినప్పటికీ తెలంగాణలోనే కీలక స్థానాలలో కొనసాగుతున్నారు. నాలుగేళ్లపాటు గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా వివాదాలకు ఆస్కారం లేకుండా పనిచేశారు.
ఆ తర్వాత ఏసీబీ చీఫ్ గా పనిచేస్తూ, మధ్యలో అనారోగ్యంతో డీజీపీ మహేంద్రరెడ్డి సెలవుపై ఉన్నప్పుడు ఇన్ ఛార్జ్ డిజిపిగా కూడా పనిచేశారు. కొత్త డిజిపిగా తెలంగాణా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారిని సీనియారిటీ ప్రాతిపదికన నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
సీనియారిటీ పరంగా జాబితాలో అర్హులైన ఐపీఎస్ అధికారుల బయోడేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రసుత్తం డిజిపి, అదనపు డీజీపీ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వారితో పాటు.. సీనియర్ ఐపీఎస్ అధికారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఐపీఎస్ అధికారుల్లో ఏపీ క్యాడర్ కు చెందిన తెలంగాణ డిజిపి అంజనీకుమార్, అదనపు డిజి అభిలాష బిస్త్, అభిలాష్ మహంతి తెలంగాణలో పనిచేస్తున్నారు. అదే విధంగా, ఎపిలో తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారులు మనీష్‌కుమార్‌సింగ్,అమిత్ గార్గ్, అతుల్ సింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు.
ఐఎఎస్ కేడర్ నుంచి సోమేశ్‌కుమార్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు మొదట కేటాయించిన వాణీప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్ రోస్, ఎం.ప్రశాంతి, కె.ఆమ్రపాలి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ కేడర్ అధికారులు వై శ్రీలక్ష్మి, హరికిరణ్, సృజన, శివశంకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు.
అయితే, సోమేశ్ కుమార్ మాదిరిగా ఈ అధికారులను కూడా మాతృ కేడర్‌కు చెందిన రాష్ట్రానికి తరలించాలని కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేస్తుందో లేదో చూడవలసి ఉంది. కేంద్రం పట్టుబట్టితే ఈ అధికారులు కూడా తమ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రేక్షక పాత్ర వహించవలసిందే. ఎన్నికల సంవత్సరంలో కేసీఆర్ తనకు నమ్మకస్తులైన అధికారులపై ఆధార పడకుండా చేయడమే కేంద్రం వ్యూహంగా కనిపిస్తుంది.