ఏపీ మంత్రులు ఈ మధ్య ప్రధాన ప్రతిపక్షం టిడిపిపై కన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరం కావడానికి పవన్ కారణంగా ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి తమను రాజకీయంగా సమాధి చేస్తామని శపధాలు చేస్తుండటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ మంత్రులలో అందరికన్నా ఎక్కువగా అదే సామాజిక వర్గానికి చెందిన నీటి వనరుల మంత్రి అంబటి రాంబాబు సమయం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై మాటలతో దండయాత్ర చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి భేటీ కావడాన్ని సహించలేకపోతున్నారు.
ఏపీ రాజకీయాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని, తనకు ఏపీలో కనీసం ఓటు హక్కు కూడా లేదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వాఖ్యాలను ప్రస్తావిస్తూ రాంబాబు పవన్ ను ఎద్దేవా చేశారు. ‘తల్లిని దూషించిన వారితో.. తమ్ముడు రాజీపడితే.. అన్నయ్యకు రాజకీయాల పట్ల విరక్తి కలిగిందేమో?’ అంటూ ట్వీట్ చేశారు.
‘నేను మీకు అండగా ఉండి 15,17 సీట్లు పశ్చిమగోదావరి జిల్లా నుంచి మీ టీడీపీకి ఇస్తే.. నా తల్లిని అవమానించారు.. తెలుగుదేశం పార్టీని, లోకేష్‌ను క్షమించను ఖబడ్దార్’ అంటూ గతంలో పవన్ ఆగ్రహంతో అన్న మాటల వీడియోను ఇప్పుడు మళ్లీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. గతంలో టీడీపీని క్షమించను అన్న పవన్ ఇప్పుడు వారితో ఎలా కలుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
అసలు రహస్యం ఏమిటంటే పవన్ కళ్యాణ్ పై మాటల యుద్ధం చేయడం ద్వారా తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టిలో పడి సురక్షితమైన సీట్ సంపాదించాలని రాంబాబు తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో తిరిగి పోటీ చేస్తే డిపాజిట్ రావడం కూడా కష్టం కాగల ప్రజా వ్యతిరేకత యిక్కడ సొంత పార్టీ శ్రేణుల నుండే ఉంది.
అంతేకాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడి నుండి పోటీ చేసినా కష్టమే కాగలదు. అందుకనే, పొరుగు జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకొంటున్నారు. అందుకు జగన్ ఏమాత్రం ఇష్టపడతారో అన్నది అర్ధం కావడం లేదు. 1989లో మొదటిసారి సొంత నియోజకవర్గం రేపల్లె నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన రాంబాబు 1994లో ఘోరంగా ఓటమి చెందారు. తిరిగి అక్కడి నుండి పోటీ చేసే ధైర్యం చేయలేదు.
జగన్ అనుగ్రహించి సత్తెనపల్లి సీట్ ఇస్తే మొదట్లో 2014లో ఓటమి చెంది, 2019లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై పెరిగిన అసంతృప్తితో గెలుపొందారు. ఆ రోజులలో సత్తెనపల్లి నుండి ఎందుకు పోటీ చేస్తున్నారంటే “మన సంగతి రేపల్లె ప్రజలకు తెలుసు. జన్మలో నన్ను గెలిపించారు. ఇక్కడి వారికి తెలియదు గదా. అందుకే పోటీ చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు సత్తెనపల్లి కూడా తన సంగతి అందరికి అర్థం కావడంతో తన గురించి పెద్దగా తెలియని అవనిగడ్డపై కన్ను పదిన్నట్లున్నది.