సోమేశ్ కుమార్ క్యాడర్ రద్దుతో తెలుగు సీఎంలకు చుక్కెదురు!

Friday, December 20, 2024

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలలోని స్థానిక క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల క్యాడర్ ఉన్నతాధికారులను పట్టించుకోకుండా, పొరుగు రాష్ట్రానికి చెందిన అధికారులకు అన్ని నిబంధనలను పక్కనపెట్టి కీలక పదవులు ఇస్తూ వస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ క్యాడర్ కు చెందిన శ్రీలక్ష్మి కోసం ఎంతగా ప్రయత్నాలు చేశారో తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అన్నప్పటికీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ ఆమె సేవలను ఉపయోగించుకొంటున్నారు. తనతో పాటు సీబీఐ కేసులలో నిందితులైన అధికారులకు పెద్ద పీట వేసే ప్రయత్నం చేస్తున్నారు.  అదే విధంగా సీఎం కాగానే, స్టీఫెన్ రవీంద్రను తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకున్నారు. అయితే చివరకు తెలంగాణకు పంపవలసి వచ్చింది.

 సీఎం ఎట్లాగూ అందరు అధికారులకు అందుబాటులో ఉండక పోవడంతో సోమేశ్ కుమార్ తనదే రాజ్యం అన్నట్లు వ్యవహరించారు. ఆయన వైఖరి పట్ల తెలంగాణ క్యాడర్ ఉన్నతాధికారులతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.  తాజాగా ఇన్ ఛార్జ్ డిఐజిగా నియమించిన అంజనీ కుమార్ సహితం ఏపీ క్యాడర్ కు చెందిన వారీ కావడం గమనార్హం.

పలువురు అధికారులు గత ఎనిమిదిన్నరేళ్లల్లో ఒక్క రోజు కూడా ఏపీలో పనిచేయకుండా తెలంగాణలోనే పనిచేస్తున్నారు.  మంగళవారం మధ్యాహ్నం తీర్పు కాపీ వెబ్‌సైట్‌లో వెలుగుచూసింది. వెనువెంటనే డి.ఓ.పి.టి.అధికారులు హైకోర్టు తీర్పును అమలు చేస్తూ మంగళవారం సాయంత్రం 3.30 గంటలకల్లా ఆయన రిలీవ్ చేయడమే కాకుండా ఈనెల 12వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కూడా ఆదేశించింది.
పైగా, అప్పీల్ కోసం తీర్పు అమలుకు 3 వారాలు సమయం కావాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. . ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.అధికారులను వారివారి సొంత కేడర్ స్టేట్‌లకు వెళ్ళేటట్లుగా చేయాలని కేంద్రం సీరియస్‌గా తీసుకొందని సోమేశ్ కుమార్ వ్యవహారం వెల్లడి చేస్తుంది. దానితో పలువురు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర డి.జి.పి.గా ఇటీవలనే నియమితులైన అంజనీకుమార్ కూడా ఏపీ రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏపీలో పనిచేస్తున్న వై శ్రీలక్ష్మి సహితం తెలంగాణకు రావాల్సిందే. తెలంగాణాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులలో  ఎ.వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, డి.రొనాల్డ్ రాస్, ఎం.ప్రశాంతి, అమ్రాపాలిలతో పాటు  ఐ.పి.ఎస్.అధికారుల్లో అభిలాష బిస్త్, సంతోష్ మెహ్రా కూడా ఏపి కేడర్‌కు చెందిన వారే. 

2014 రాష్ట్ర విభజన తర్వాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. సోమేశ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా  కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారని ఆరోపించారు. 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారని ధ్వజమెత్తారు.

కాగా, సోమేష్ తీసుకున్న‌ప‌లు నిర్ణ‌యాల‌పై సిబిఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిహార్ ముఠాకు సోమేశ్ లీడర్ అని అంటూ  ఇప్పటి వరకు సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles