ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువల గురించి ప్రవచనాలు ఇస్తుంటారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకం అంటూ ఉంటారు. ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు.. ఆ పదవికి రాజీనామా చేయకుండా తమ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోబోం అని.. అలాంటి విలువలు పాటిస్తామని చెబుతూ ఉంటారు. ఈ నైతిక విలువలన్నీ‘టెక్నికల్’ గా మాత్రమే. ఆచరణలోకి వస్తే.. తాను ఉపదేశించే విలువలకు ఇబ్బంది కలగకుండా.. అన్ని రకాల ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కూడా ఆయన వద్ద వక్రమార్గాలుంటాయి. అలాంటి వక్రమార్గాలనే అనుసరిస్తుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, ఆ పార్టీ మీద చాలా తరచుగా ధిక్కార స్వరమూ, తిరుగుబాటు వెటకార స్వరమూ వినిపిస్తూ ఉండే ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కూడా ఇప్పుడు జగన్ చూపించిన బాటలోనే ఆ పార్టీని వదిలించుకోవాలని డిసైడైనట్లుగా కనిపిస్తోంది.
సీఎం జగన్ తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో కలిపేసుకున్నారు. అయితే ఇవేవీ ఫిరాయింపుల కిందికి రాకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. సదరు ఎమ్మెల్యేలు మాత్రం తెలుగుదేశం జాబితాలోనే ఉంటారు. వారు వెళ్లి ‘మర్యాదపూర్వకంగా’, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలుస్తారు. ఈ సందర్భంగా వారి కొడుకులు, ఇతర వారసులు, అనుచరులకు ముఖ్యమంత్రి వైసీపీ కండువా కప్పి.. తన పార్టీలో చేర్చుకుంటారు. వారిని మాత్రం తప్ప! అంటే ఇదంతా కూడా తాను ప్రవచించే నైతికవిలువలకు కట్టుబడి ఉన్నట్టుగా డప్పుకొట్టుకోవడానికే అన్నమాట. ఈ క్రమంలో వల్లభనేని వంశీ లాంటి ఎమ్మెల్యేలు.. కండువా కప్పుకోవడం మినహా.. పూర్తిస్థాయిలో జగన్ కోటరీలోకి చేరిపోయి.. శాసనసభలో కూడా తమను టీడీపీ మెంబరుగా కాకుండా స్వతంత్ర సభ్యుడుగా గుర్తించమని స్పీకరును కోరి, ఆ మేరకు టీడీపీ సంఖ్యాబలం తగ్గిస్తారు.
ఇప్పుడు రఘురామక్రిష్ణ రాజు కూడా అదే పని చేస్తున్నారు. జగన్ తో విబేదించిన నాటినుంచి.. ప్రభుత్వం మీద పార్టీ మీద ప్రతిరోజూ ఏదో ఒక విషయంపై విమర్శలు, వెటకారాలు చేస్తూ ఉండే రఘురామక్రిష్ణ రాజు తాజాగా తనను స్వతంత్ర సభ్యుడిగా గుర్తించి పార్లమెంటులో తనకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలని స్పీకరుకు లేఖ రాశారు. తాను సభలో ఎప్పుడు ఏం మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ తన సొంత పార్టీ సభ్యులే హేళన చేస్తూ, విమర్శలు చేస్తూ అడ్డుకుంటున్నారని, వైసీపీ సభ్యుడిగా కాకుండా స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని కోరారు. ఆల్రెడీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలనే వైసీపీ పార్టీ ఫిర్యాదు స్పీకరు వద్ద పెండింగులో ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విజ్ఞప్తిని స్పీకరు పట్టించుకుని.. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటే గనుక.. అది జగన్ చూపిన బాటలోనే, జగన్ మీద ఆర్ఆర్ఆర్ సాధించిన విజయంగా అనుకోవాల్సి ఉంటుంది.
జగన్ చూపిన బాటనే అనుసరిస్తున్న ఆర్ఆర్ఆర్
Saturday, December 21, 2024