ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గానీ.. ఆయనకు ఆల్రెడీ పొగబెట్టారు. పొమ్మని స్పష్టంగా చెప్పలేదు, ఆయన నియోజకవర్గంలో మరొక నాయకుడికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించను కూడా లేదు. కానీ, ఆయన మాత్రం కంప్లీట్ గా లూప్ లైన్లో ఉన్నారు. సొంత పార్టీ నేతలు పెడుతున్న పొగలో నిత్యం సతమతం అవుతున్నారు. దానికి తోడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వర్తమాన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతున్నప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువు తీసే విధంగా ఉన్నాయి.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి ఆ పార్టీలో ఏమాత్రం బాగాలేదు. ఆపార్టీలో కొనసాగడమూ, మళ్లీ టికెట్ దక్కించుకోగలగడమూ లాంటి సంగతులు తర్వాత.. అసలు ఆయన రాజకీయాల్లో కొనసాగుతారో లేదో కూడా క్లారిటీ రావడం లేదు. ఆయన తాజాగా వైసీపీ అనే పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆ పార్టీలో ఉండే పోకడలన్నింటినీ కళ్లకు కట్టినట్టుగా చెప్పుకొచ్చారు. నిత్యం వెంట పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం తనకు చేతకావడం లేదని, అందువల్ల పాతతరం నాయకుడిలాగా మారిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. 55 ఏళ్లుగా తన కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉన్నదని అన్నారు. రౌడీలను వెంటబెట్టుకుని వారిలాగా ప్రవర్తిస్తే తప్ప ముందడుగు వేయలేమని వాపోయారు.
వైసీపీలో ఉన్న నాయకుల తీరుతో పాటు ఆయన ప్రత్యేకంగా మంత్రి జోగి రమేష్ ను ఉద్దేశించి అంటున్నారని కూడా పలువురు భావిస్తున్నారు. ఎమ్మెల్యే వసంత కు ఆయన సొంత నియోజకవర్గంలో జోగి రమేష్ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తన నియోజకవర్గం కాకపోయినప్పటికీ.. అక్కడ ఆయన ప్రత్యామ్నాయ రాజకీయ అధికార కేంద్రంలాగా చెలాయించాలని చూస్తున్నారు. దీనిపై పలుమార్లు పంచాయతీ జరిగింది. మైలవరం సెగ్మెంటు సమీక్ష సమావేశం జగన్ స్వయంగా నిర్వహించినప్పుడు కూడా.. వచ్చిన వాళ్లంతా జోగి రమేష్ తీరు మీద సీఎంకు ఫిర్యాదు చేశారు. అయితే జగన్ మాత్రం.. నింపాదిగా.. జోగి రమేష్ బీసీ నాయకుడు, మనం తయారు చేసుకున్న నాయకుడు.. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.. అంటూ ఆయన వేధింపులు అనుభవిస్తున్న వారికి ఎదురు క్లాస్ పీకి పంపడం విశేషం.
ఇలాంటి నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ వచ్చే ఎన్నికల నాటికి అసలు పార్టీలో కొనసాగబోరనే మాట సర్వత్రా వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయన వ్యాఖ్యాలు తాజాగా సంచలనంగా మారుతున్నాయి. మూడున్నరేళ్లలో తానెక్కడా పథకాలు ఆపలేదని, అక్రమ కేసులు ఎవ్వరిమీద పెట్టించలేదని చెప్పడం కూడా ఎవరిని ఉద్దేశించి అన్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గడపగడపకు కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో నిలిపేసిన వసంత కృష్ణప్రసాద్ భవితవ్యం ఆ పార్టీలో మాత్రం ఇక ఉండదని అందరూ అనుకుంటున్నారు.
వైసీపీనేత చుట్టూ పదిమంది రౌడీలుండాల్సిందేనా?
Monday, December 23, 2024