ప్రధాని మోదీ తెలంగాణాలో పోటీచేసే సాహసం చేస్తారా!

Thursday, September 19, 2024

ఉత్తరాదిన పెరుగుతున్న ప్రతికూలతను తట్టుకొని, 2024లో తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణాదిన పార్టీ పరిస్థితి మెరుగు పడాలని బిజెపి అధిష్ఠానం కొంతకాలంగా విశేష ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు, తెలంగాణాలో అధికారంలో రావడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. 

ఈ సందర్భంగా దక్షిణాదిన ప్రజలలో ఒక కదలిక తీసుకు రావడం కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాదిన ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉందని గత కొద్దీ రోజులుగా ప్రహకారం జరుగుతున్నది. ఈ సందర్భంగా తెలంగాణ, తమిళనాడులలోని రెండు నియోజకవర్గాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే అంతర్గత సర్వేలు కూడా జరిపించారని చెబుతున్నారు. 

బీజేపీ నేతలు, కార్యకర్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ప్రచారం చేస్తున్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో కోల్పోయిన సయమంలో ఇందిరాగాంధీ రెండు సార్లు దక్షిణాది నుండి పోటీ చేసి, తర్వాత కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఒక సారి ప్రస్తుతం తెలంగాణలోని మెదక్ నుండి పోటీ చేయగా, రెండు సారి కారాన్తకలోని చిక్కమంగళూర్ నుండి పోటీ చేశారు. 

2014లో సహితం ప్రధాని అభ్యర్థిగా మోదీ గుజరాత్ లోని ఓ నియోజకవర్గంతో పాటు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుండి కూడా పోటీ చేశారు. ప్రస్తుతం అక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, అప్పుడు మోదీ గాని, అంతకు ముందు ఇందిరాగాంధీ గాని తమ పార్టీకి బలమైన, అప్పటికే పార్టీ గెలిచిన స్థానాల నుండే పోటీ చేయడం గమనార్హం. గత ఎన్నికలలో డిపాజిట్ కూడా పొందలేని నియోజకవర్గం నుండి పోటీ చేసే సాహసం చేస్తారని అనుకోలేము. 

మహబూబ్ నగర్ నుండి గతంలో ఒక సారి బీజేపీ గెలుపొందిన టిడిపి మద్దతుతో గెలుపొందింది. సొంతంగా ఎప్పుడూ పోటీ చేయలేదు. గత ఎన్నికలలో బీజేపీ గెలుపొందిన నాలుగు స్థానాలలో సహితం వచ్చే ఎన్నికలలో తిరిగి బిజెపి గెలుస్తుందనే భరోసా ఇప్పుడు ఆ పార్టీ నాయకులలో లేదు. 

తెలంగాణాలో ప్రధాని మోదీ పోటీ చేస్తారని వస్తున్న కథనాలపై రాష్ట్ర బిజెపి నాయకులు ఎవ్వరు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. పైగా, ఉత్తర ప్రదేశ్ లో అత్యధిక సీట్లు గెలుపొందకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని మోదీ వారణాసి నుండి పోటీ చేశారు. దక్షిణాది నుండి పోటీ చేయడం వల్లన అటువంటి ప్రయోజనం ఉండదు. 

ప్రస్తుతం నాలుగు సీట్లు బిజెపికి  లభించగా, ఎంతగా అనుకూలంగా గాలి వీచినా మరో రెండు, మూడు సీట్లు గెలుపొందవచ్చు. అదే విధంగా తమిళనాడులో ఎంత అనుకూలంగా గాలి వీచినా, అన్నాడీఎంకే మద్దతుతో మూడు, నాలుగు సీట్లు మాత్రమే గెలుపొందే అవకాశం ఉంది. నాలుగైదు సీట్ల కోసం స్వయంగా ప్రధాని వచ్చి పోటీ చేసే సాహసం చేస్తారని అనుకోలేము. 

మోదీ స్వయంగా పోటీ చేస్తే కేసీఆర్ కు `తెలంగాణ సెంటిమెంట్’ రగిల్చే అవకాశం ఇచ్చినట్లు కాగలదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అనేకం ఇంకా అమలు కాకపోవడం, తెలంగాణకు ఉద్దేశించిన పలు ప్రాజెక్ట్ లను ఇతర రాష్ట్రాలకు తరలించడం వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఇచ్చినట్లు కాగలదు. 

ఖాయిలా పడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడం మినహా మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు ఒక్క భారీ ప్రాజెక్ట్ కూడా రాలేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రధాని మోదీ పోటీ చేయడం వల్లన బీజేపీ వ్యతిరేక ప్రచారం ఎన్నికల సమయంలో ఊపందుకునే ప్రమాదం లేకపోలేదు.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles