‘అబ్బాయి మళ్లీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు, మీ ఖర్మ, నాశనమైపోతారు’ అని శపించడం ఒక్కటే తక్కువ.. జగన్ బాబాయి, దాదాపు అదే రేంజిలో ప్రజలను బెదిరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. ఇప్పుడు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏవీ కొనసాగవని, ప్రజలు అవన్నీ కోల్పోతారని టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని వాలంటీర్లు, పార్టీ సచివాలయ సమన్వయ కర్తలు ఇంటింటికీ తెలియజెప్పాలని ఆయన హితోపదేశం చేస్తున్నారు. మొత్తానికి ప్రతి నెలకు ఒకసారి ప్రతి ఇంటికి తిరిగే అలవాటు ఉన్న వాలంటీర్ల ద్వారా.. ఈ బెదిరింపులను క్షేత్రస్థాయి వరకు ఫార్వర్డ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అధ్యక్షుడి బాధ్యతలతోపాటు, ఉత్తరాంధ్రకు పార్టీ ఇన్చార్జి బాధ్యతలను కూడా చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కీలకంగా భావిస్తున్న ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్.. సొంత బాబాయి చేతిలోనే పెట్టారు. తిరుమల వేంకటేశ్వరస్వామివారి సేవను పక్కన పెట్టి అయినా సరే.. పూర్తి స్థాయిలో పార్టీ సేవలో నిమగ్నం కావడానికి వైవీ ఆల్రెడీ అంగీకరించినట్టే కనిపిస్తోంది.
కేవలం రెడ్లకు మాత్రమే కీలకపదవులు కట్టబెట్టకుండా.. జగన్ అన్ని కులాలకు న్యాయం చేస్తున్నాడనే కీర్తిని గడించడానికి.. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ అధ్యక్ష పదవికి సంక్రాంతి తర్వాత రాజీనామా చేయనున్నట్లు సమాచారం. బోర్డు మొత్తం రద్దయి.. జగన్ సరికొత్త బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర మీద జగన్ కు ప్రేమ ఉంటే.. టీటీడీ బోర్డులో కనీసం ఒక్కరికైనా చోటిచ్చారా అని చంద్రబాబునుంచి విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో.. చైర్మన్ పోస్టులో నాన్-రెడ్డి/బీసీ నాయకుడిని నియమించడంతో పాటు, కొత్త బోర్డులో ఉత్తరాంధ్ర ప్రాతినిధ్యం కూడా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో అనకాపల్లిలో వాలంటీర్లకు స్పూర్తి ఇచ్చే కార్యకమంలో వైవీ పాల్గొన్నారు. జగన్ ఓడిపోతే.. సంక్షేమ పథకాలు ఏవీ రావు అనే సంగతి క్షేత్రస్థాయిలో ప్రజలకు బాగా నూరిపోయాలని వారు కోరుకుంటున్నారు. వైసీపీ దళాలు ఆల్రెడీ ఈ ఎజెండాను భుజానికెత్తుకుని తిరుగుతున్నాయి. దీని కౌంటర్ గా చంద్రబాబునాయుడు ఆల్రెడీ.. ఈ సంక్షేమ పథకాలు అన్నీ తిరిగి కొనసాగుతాయని.. జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆయన సైకోలాగా. నిలిపివేసిన తెలుగుదేశం ప్రభుత్వం నాటి పథకాలు అన్నీ కూడా మళ్లీ కొనసాగుతాయని చంద్రబాబు అంటున్నారు.