జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల విసుగెత్తిపోయిన వారికి ఇది శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టానికి.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని సృష్టించి ఇచ్చారు. జీవో నెం.1 పేరుతో ప్రతిపక్షాల పీక నొక్కేయాలని చేస్తున్న ప్రయత్నాలే.. విపక్షనేతల భేటీకి దారితీశాయి. కుప్పంలో చంద్రబాబునాయుడు సభలు, రోడ్ షోల పట్ల పోలీసులు వ్యవహరించిన అమానుష, అరాచక వైఖరి వలన.. పవన్ కల్యాణ్, హైదరాబాదులోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన ప్రయత్నాలకు సంఘీభావం తెలిపారు. విశాఖలో ఎలాగైతే తనను నిర్బంధించినప్పుడు.. చంద్రబాబునాయుడు వచ్చి కలిసి సంఘీభావం తెలిపారో.. అదే సాంప్రదాయం పాటించారు. కాకపోతే.. ఈ సమయానికి రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం ఇరుపార్టీలు కలిసి.. రాష్ట్రంలోని అన్ని ఇతర పార్టీలు, ప్రజావేదికలు, ప్రజాసంఘాలను కూడా కలుపుకుని ఐక్యపోరాటం చేస్తాం అని ప్రకటించేశారు. ఇది జీవో నెం.1 మీద పోరాటంలాగానే ప్రకటించినప్పటికీ.. మౌలికంగా ఇది.. ప్రభుత్వం మీద యుద్ధానికి పూరిస్తున్న శంఖారావంగానే పలువురు భావిస్తున్నారు.
తెలుగుదేశం- జనసేన పొత్తులు ఖరారైనట్లే! కాకపోతే అధికారిక ప్రకటన మాత్రమే రాలేదు. భారతీయ జనతా పార్టీతో కూడా ముడి ఉన్నది గనుక.. వారి సమ్మతి కోసం ఎదురుచూస్తున్నారు. జీవోనెం.1 పేరుతో జరుగుతున్న ప్రజాపోరాటానికి బిజెపిని కూడా కలిసి వారి మద్దతు కూడా స్వీకరిస్తాం అని చంద్రబాబునాయుడు ప్రకటించడం విశేషం. ఎటూ వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీరి వెంట నిలుస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఈ పోరాటానికి పిలుపు ఇవ్వడమే ఈ రెండు పార్టీ నేతల శంఖారావం అని అనుకోవాల్సి ఉంటుంది.
నిజానికి తెలుగుదేశం- జనసేన కలిస్తే చాలు.. అది బలీయమైన శక్తిగా ఖచ్చితంగా తయారవుతుంది. రాష్ట్రంలో ఆ పార్టీల పొత్తు బంధానికి బిజెపి మద్దతు అవసరమే లేదు. కానీ కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఏర్పడే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో.. కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండడానికిన బిజెపిని కూడా కలుపుకోవడానికి చూస్తున్నారు తప్ప.. మరొకటి కాదు. ఈ కూటమితో కలిస్తే.. కమలదళం కూడా ప్రభుత్వంలో భాగంగా ఉంటుంది. లేకపోతే.. ఒంటరిగా పోటీచేసి తమకుఒక్కశాతం ఓటు బ్యాంకు మాత్రమే ఉన్నదని మరోసారి నిరూపించుకుని పరువు కోల్పోతుంది అని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇద్దరు నాయకుల కలయిక, శంఖారావం ఇవాళే జరగడానికి వారి అభిమానులంతా రెడ్డికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయన జీవో నెం.1 అనే అరాచకమైన ఉత్తర్వులు తేకుండా ఉంటే గనుక.. ఈ భేటీ ఇంకాస్త ఆలస్యం అయిఉండేది.