రాజకీయ సభలు, ర్యాలీలపై నిషేధం విధించి, టిడిపి అధినేత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించకుండా అడ్డుకోవాలని చూసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శృంగభంగం జరిగింది. పైగా, ఆంక్షల మధ్యనే పాదయాత్రల ద్వారా తన మూడు రోజుల పర్యటనను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు జగన్ లో ఓటమి భయం పట్టుకుందని ప్రజలకు తెలిసేటట్లు చేయడంలో చంద్రబాబు విజయం సాధించారు.
జగన్ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి చంద్రబాబును ప్రజల వద్దకు వెళ్లకుండా చేయడానికి చేసిన విఫల ప్రయత్నాలు వికటించాయి. ప్రభుత్వ దుష్ట పన్నాగాలను పసిగట్టిన ప్రజలే తమ నాయకుడి వద్దకు రావడం ద్వారా ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రవేశాలను, చంద్రబాబు నాయకత్వం పట్ల మమకారాన్ని స్పష్టంగా చాటుకోవడం జరిగింది.
ఒకానొక సమయంలో జాతీయ రాజకీయాలలో నిర్ణయాత్మక పాత్ర వహించిన, సుదీర్ఘకాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వంటి నాయకుడిని, వరుసగా ఏడు సార్లు గెలుపొందిన సొంత నియోజకవర్గంకు వెళ్లకుండా ప్రభుత్వం చేసిన అడ్డుకొనే ప్రయత్నాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నాయకత్వం ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితుల పట్ల అనుమానాలు కలిగించాయి.
“పులివెందుల రౌడీ! సైకో జగన్!!” అంటూ చంద్రబాబు ప్రజాక్షేత్రంలో ప్రశ్నించడం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ తరంగాల వలే టిడిపి శ్రేణులను ఉత్సాహ పరిచాయి. తన పర్యటనలలో వాడే చైతన్య రధాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం, చంద్రబాబు కోసం వచ్చిన వారిపై అసందర్భపు కేసులు నమోదు చేయడం వంటి చర్యలను ఆసరా చేసుకుని ప్రభుత్వ నేతలలో పెరుగుతున్న అభద్రతా భావాన్ని చంద్రబాబు చక్కగా బహిర్గతం చేయగలిగారు.
రోడ్ పైననే భైఠాయించి తన చైతన్య రథం తిరిగి ఇస్తే గాని కదలను అంటూ భీష్మించుకుని కూర్చోవడం, చైతన్యరథం లేకపోయినా తన కేరవాన్ పై నుండే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ప్రజలు చంద్రబాబులో ఓ కొత్త నాయకుడిని చూసినట్లయింది. “ప్రజలకోసం ఎంతవరకైనా వెళ్ళతా. నాది ఉక్కు సంకల్పం. సైకో పాలనను అంతం చేస్తా” అంటూ చంద్రబాబు చేసిన గర్జనలు అధికార పక్షంలో ప్రకంపనలు సృష్టించాయి. ఓ పోలీసులే చంద్రబాబును ప్రజలకు చేరువ చేసిన్నట్లయింది.
అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారు అసలు జిఓను చదవకుండా విమర్శలు చేస్తున్నారని, అందులో ఎక్కడా రాజకీయ పక్షాల ర్యాలీలు, సభలపై నిషేధాలు లేవని, కేవలం రోడ్లపై జరిపితే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని మాత్రమే ఉందని అంటూ ఆత్మరక్షణ ధోరణిలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వారి మాటలలో నిర్వేదం స్పష్టంగా కనిపించింది.
“వైసిపి శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరపున పోరాడతా” అంటూ ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంకు వత్తాసు పలుకుతూ, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులను సహితం ఆయన సున్నితంగా హెచ్చరించారు.
”పోలీసులూ..ఏంటీ బానిసత్వం? మీరు బానిసలుగా బతకొద్దు. చట్టప్రకారం మీ విధులు నిర్వర్తించండి. ఇక్కడి నుంచి నన్ను తిరిగి పంపాలని చూస్తున్నారు.. కానీ నేను వెళ్లను. మిమ్మల్నే ఇక్కడి నుంచి పంపిస్తా. మిమ్మల్నే కాదు.. సైకో సీఎం, ఆయన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతా” అంటూ ఆగ్రహంతో స్పష్టం చేశారు.
“నా గొంతు 5 కోట్ల మంది ప్రజలది. ఆ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు. నేను ప్రశ్నిస్తుంటే పోలీసు అధికారులు పారిపోతారా? సంబంధిత అధికారికి సిగ్గులేదా? చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు” అంటూ పోలీసుల ధోరణి పట్ల కన్నెర్ర చేశారు.
“ప్రజలు తిరగబడితే ఏం చేయగలరు? పోలీసులు ఎక్కడుంటారు.. మీరు ఆకాశంలో తిరగాల్సి ఉంటుంది. ఎన్ని జైల్లు, పోలీస్స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ప్రజలను వాటిలో పెట్టగలరు?” వారిని నిలదీశారు. పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తే ప్రజలు సహకరిస్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారంతా దోషులే అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన ప్రజలను కలవనీయకుండా అడ్డుకుంటుంటోందని ఆరోపించారు. తాను ఎక్కడి నుంచి మాట్లాడాలని అడిగితే.. పోలీసుల నుంచి సమాధానం లేదన్నారు. వెంటనే చంద్రబాబు తన కేరవాన్ పైకి ఎక్కి ప్రసంగించడంతో ఉద్రిక్తత నెలకొంది.