అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వ్యతిరేకిస్తున్న వారికి రకరకాల చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టిన వారి మీద పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. పోలీసులు వారిని అరెస్టు చేసి వేధిస్తున్నారనే విమర్శలున్నాయి. అదే సమయంలో విమర్శలు చేసే రాజకీయ పార్టీల నాయకుల మీద, వారి ఆస్తుల మీద ఏకంగా దాడులు జరుగుతున్న దుర్ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజకీయాలతో ప్రమేయం లేకుండా.. ప్రభుత్వ వైఫ్యల్యాల్ని ప్రశ్నిస్తున్న వారిని కూడా కొందరు టార్గెట్ చేస్తున్నారా? అనే అభిప్రాయం ప్రస్తుతం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుకు కొందరు విషపూరిత ఆహారం ఇచ్చి హత్యకు ప్రయత్నించారనే వార్తలు ఇప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
కొలికపూడి శ్రీనివాసరావు.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ఉంటారు. వివిధ వేదికలపై ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తుంటారు. టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు. ఆయన మీద హత్యాప్రయత్నం జరగడం ఇప్పుడు కొత్త ఆందోళనలకు తావిస్తోంది.
ఆయన చెప్పిన వివరాలు ప్రకారం జరిగిన సంఘటనల క్రమం ఇలా ఉంది..
శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి 9 గంటలకు ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని, అది ముగిసిన తర్వాత పార్కింగ్ కు వచ్చారు. అక్కడ ఇద్దరు యువకులు కలిసి అభిమానులమంటూ ఆయనతో ఫోటో దిగారు. ఓ వందమీటర్ల దూరంలో వెళ్లాక రోడ్డు పక్కన ఒక యువకుడు కారును ఆపాడు. తన పేరు మునిరత్నం అని చెప్పుకుని, అభిమానినని అన్నాడు. ప్రసాదం అంటూ ఒక పొట్లం విప్పి పులిహోర పెట్టాడు. అది తినేసి ఇంటికి వెళ్లిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. వళ్లంతా దద్దర్లు, వాపు, వాంతులు అయ్యాయి. ఆస్పత్రికి ఆయనను తరలించారు. వైద్యులు జాగ్రత్తగా వ్యవహరించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పులిహోర లో ఏదో కలపడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని డాక్టర్లు కూడా అనడం విశేషం.
అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న వారిపై అధికార పార్టీ వారు ఏ స్థాయికి తెగిస్తున్నారు? అనేది! పోలీసులు కేసులు పెట్టడం, వేధించడం, సంక్షేమ పథకాలు నిలుపు చేయించడం వంటి వ్యవహారాలు ఒక ఎత్తు అయితే.. ఏకంగా వారిని చంపడానికి కూడా ప్రయత్నిస్తారా? అనే భయాలు ఇప్పుడు కలుగుతున్నాయి. రాజకీయ విమర్శలు, విధానాలపై విమర్శలకే మనుషుల్ని చంపేస్తూ వెళితే.. ఇక ఎవరినీ మిగలనివ్వరా అనే చర్చ ప్రజల్లో మొదలవుతోంది. కొలికపూడి శ్రీనివాసరావు పై విషం పెట్టి హత్యకు యత్నించిన ప్రయత్నాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకూడదని, క్షుణ్నంగా దర్యాప్తు చేయాలని లేకపోతే ప్రభుత్వంపై నమ్మకం పోతుందని ప్రజలు అంటున్నారు.
జగన్ వ్యతిరేకులకు విషంపెట్టి చంపేస్తారా?
Monday, December 23, 2024