సంజయ్ పాదయాత్రపై బీజేపీలో గందరగోళం!

Monday, December 23, 2024

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర `ప్రజా సంగ్రామ యాత్ర’ను కొనసాగించే విషయంలో రాష్ట్ర బీజేపీలో గందరగోళం నెలకొన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు విడతలుగా యాత్ర పూర్తి చేసిన ఆయన తెలంగాణకు ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నందున యాత్రను ముగిస్తున్నట్లు యాత్ర చివరి రోజున ప్రకటించారు. మరో పది రోజుల పాటు హైదరాబాద్ లో యాత్ర చేసి ముగిస్తానని చెప్పారు.

అయితే, తాజాగా యాత్ర కొనసాగించడానికి పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించారు. ఈ నెల 18 నుంచి యాత్ర మొదలుపెట్టాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం రూట్‌ మ్యాప్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

కొడంగల్‌ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఆరో విడత పాదయాత్రను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.అయితే, మొదట్లో మాదిరిగా ఆయన యాత్రలలో పార్టీ సీనియర్లు అనేకమంది మొక్కుబడిగా కన్పించి తప్పించుకొంటున్నారు. వారెవ్వరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

సంజయ్ ఈ యాత్రను తనను తెలంగాణాలో బిజెపికి తిరుగులేని నాయకుడిగా ప్రచారం చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానితో రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సిద్ధం చేయడం పట్ల, సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం పట్ల ఆసక్తి చూపడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి.

అదీగాగా, యాత్ర సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ తదితరులపై సంజయ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాషను పార్టీ మద్దతుదారులు సహితం ఆమోదించలేక పోతున్నారు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అటువంటి చౌకబారు భాషను ప్రయోగించడాన్ని ప్రజలు హర్షింపరని హెచ్చరిస్తున్నారు.

 ప్రజా జీవనంలో మనం  వాడే భాష, ప్రతి పదం తీవ్ర ప్రభావం చూపుతాయని బీజేపీ సీనియర్ నాయకుడు  ఒకరు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అటువంటి విమర్శలను ప్రజలు తీవ్రంగా పరిగణలోకి తీసుకోరని, పైగా ప్రతికూలంగా స్పందిస్తారని హెచ్చరించారు.

సంజయ్ ఓ రాజకీయ నాయకుడి మాదిరిగా  కాకుండా, బాధ్యతారహితంగా పరుషపదజాలంతో చేస్తున్న విమర్శలు ప్రజలలో అధికార పక్షాన్ని నిత్యం దూషించడం తప్పా తాము అధికారంలోకి వస్తే ఏమిచేస్తామనే సందేశం ఇవ్వలేక పోతున్నాయని బిజెపి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కేసీఆర్ చేపడుతున్న రైతుబంధు, డబల్ బెడ్ రూమ్, దళిత్ ముఖ్యమంత్రి, రుణ మాఫీ వంటి విధానాలపై దండయాత్ర చేస్తున్న సంజయ్ బిజెపి అధికారంలోకి వస్తే ఆయా అంశాలపై పార్టీ వైఖరి ఏమిటో చెప్పలేక పోతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకనే, బిజెపిని ఎన్నుకొంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఆగిపోతాయని బిఆర్ఎస్ నేతలు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles