సాధారణంగా ప్రజల్లో పార్టీలకు అనుకూలంగా ఓటుబ్యాంకులుగా చాలా స్పష్టంగా చీలిపోయి ఉంటాయి. సాలిడ్ తెలుగుదేశం ఓటర్లు, సాలిడ్ వైసీపీ ఓటర్లు ఉంటారు. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప.. ఈ సాలిడ్ ఓటు బ్యాంకు ఆయా పార్టీల అభ్యర్థులకు మాత్రమే పడతాయి. ఇకపోతే.. తటస్థ ఓటర్లు అనే కీలక వర్గం ఒకటి ఉంటుంది. వీరు ఏ ఎన్నికలకు ఆ ఎన్నికల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుటారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలను ఈ తటస్థ ఓటర్లే డిసైడ్ చేస్తుంటారు. కీలకంగా ఉండే ఆ కొద్దిశాతం ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికే పార్టీలు రకరకాల పాట్లు పడుతుంటాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు పర్యటన పట్ల పోలీసుజులుం, ఆయన సభలను అణచివేసిన తీరు, ఆయనమీద నిషేదాజ్ఞల అమలు ఇవన్నీ కలిసి తటస్థ ఓటర్లలో చంద్రబాబు పట్ల సానుభూతిని పెంచినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకువచ్చిన జీవో నెం.1 అనేదే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అని ఈ తటస్థ వర్గం నమ్ముతోంది. అలాంటి నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు ఆయనకు అడుగడుగునా విధించిన ఆంక్షలు, ఆయన వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోవడం, చిన్న సభ, సమావేశం పెట్టనివ్వకుండా అడ్డుకోవడం… ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా ఆలకించకపోవడం.. తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీచార్జి చేసి.. తిరిగి వారిమీదనే హత్యాయత్నం లాంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఇలాంటి వ్యవహారాలన్నీ ఈ తటస్థ ఓటర్ల వర్గం గమనిస్తూనే ఉంది. జగన్ సర్కారు పోలీసులను పురమాయించి.. విపక్షాల పట్ల చాలా అరాచకంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది.
గత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినా కూడా.. అప్పుడు కూడా ఈ తటస్థ ఓటర్ల పాత్ర కీలకంగానే పనిచేసింది. సాంప్రదాయ వైసీపీ ఓటర్లు కాకుండా.. ‘ఒక్కచాన్స్’ అంటూ సాగిన జగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేసిన వాళ్లంతా ఈ తటస్థ ఓటర్లే. వారి పాత్ర ఎన్నడైనా కీలకంగానే ఉంటుంది. అలాంటి ఓటర్ల దృష్టిలో ఈరోజు జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో ఉండే వాళ్లు.. ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వడం తెలుసుకోవాలని, వారు చేసే విమర్శలు నిజం కాదని నిరూపించుకుంటే వారి గౌరవం పెరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అలా కాకుండా అధికారం చేతిలో ఉన్నది కదా అని, ప్రతిపక్షాల పీక నొక్కేసి.. తమకు ఎక్కడా వ్యతిరేకస్వరం వినపడడం లేదని ఆత్మవంచన చేసుకుంటే ఎలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కుప్పం జులుంతో పాతాళానికి జగన్ గ్రాఫ్!
Tuesday, November 26, 2024