వైఎస్సార్ కాంగ్రెస్ .. అధికారంలో ఉన్న పార్టీ. రాష్ట్రంలో ప్రజాజీవితం ఎలా సాగాలో నిర్దేశిస్తూ చట్టాలు తయారు చేసేది, నిబంధనలు విధించి జీవోలు తెచ్చేది వాళ్లే. ఎలాంటి ప్రజాస్వామిక ఆలోచన కూడా లేకుండా.. రూల్సు తెస్తారు. ఆ రూల్సు అందరూ పాటించాల్సిందే అని గర్జిస్తారు. రూల్సుకు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కత్తిదూస్తారు. ఇక కేసులు, అరెస్టులు, జైళ్లు, విచారణల వేధింపులు.. ఇవన్నీ షరా మామూలే. అయితే తాము మాత్రం.. రూల్సును అతిక్రమించడం కోసమే పుట్టాం అని.. ఆల్రెడీ ఉన్న నిబంధనల్ని, తమ సర్కారు తెచ్చిన నిబంధనల్ని కూడా తుంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా చెలరేగిపోవడం తమ హక్కు అని.. వారు ఆచరణలో నిరూపిస్తుంటారు. దానికి ప్రబల ఉదాహరణే.. నందిగామలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవీస్వీకారం సందర్భంగా జరిగిన జాతీయ రహదారిపై ఊరేగింపు, బాణసంచా పేలుళ్లు, హడావుడి, రాద్ధాంతం ఇదంతా కూడా!
జాతీయ రహదార్లనుంచి పంచాయతీ రోడ్ల వరకు రోడ్ల మీద సభలు పెట్టడం, రోడ్ షోలు, ప్రదర్శనలు వంటివి నిషేధం అని.. పోలీసులు ముందుగా అనుమతిచ్చిన స్థలాల్లో మాత్రమే మీటింగులు పెట్టుకోవాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల పీక నొక్కి, వారు ప్రజలకు దగ్గర కాకుండా చూడాలనే ఏకైక దుర్మార్గ ఎజెండాతోనే ఈ జీవో తెచ్చినట్టుగా రాష్ట్రమంతా రచ్చ రచ్చ అవుతోంది. ఈ జీవోనెం.1 పై అన్ని విపక్షాలూ గగ్గోలు పెడుతున్నాయి.
ఒకవైపు కుప్పంలో అక్కడి లోకల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలు నిర్వహించడానికి వెళితే.. పోలీసులు అడ్డుకున్న తీరు, వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు గురవుతోంది. కొత్త జీవో ప్రకారం సభలు కుదరదు అని చెప్పడం ఒక ఎత్తు.. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి.. చంద్రబాబు చైతన్య రథం కూడా తీసుకుని వెళ్లిపోవడం అనేది పోలీసుల వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు కార్యక్రమాలను ఈ రేంజిలో అడ్డుకుంటున్న వారు.. అదే నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ ర్యాలీలను విచ్చలవిడితనానికి ప్రతీకలుగా అనుమతిండచం విశేషం. మార్కెట్ యార్డు పదవీస్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ సమస్త నిబంధనలను తుంగలో తొక్కడమే లక్ష్యం అన్నట్టుగా సాగింది. అసలు వారు ర్యాలీకి పోలీసుల అనుమతి తీసుకోలేదు. తాము వెళ్లాల్సిన ప్రదేశానికి రెండు కిమీల దగ్గరి దారి ఉంటే.. జాతీయ రహదారి మీదుగా నాలుగుకిమీలు ర్యాలీచేశారు. విచ్చలవిడిగా బాణసంచా పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. జాతీయరహదారిని గంటసేపటికి పైగా దిగ్బంధనం చేశారు. ఇవన్నీ కూడా జీవోనెం.1 నిబంధనలకు అతిక్రమణమే. మేం నిబంధనలు పెడుతూ జీవోలు తెచ్చేది.. వాటిని మేం అతిక్రమించడం కోసమే అన్నట్టుగా వైసీపీ దళాలు రెచ్చిపోతోంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం.చంద్రబాబు పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసులు, నందిగామలో అసలేమీ పట్టనట్టే ఉండిపోవడం.. రాష్ట్రవ్యాప్తంగా వారి వైఖరిపై ప్రజల్లో అసహ్యం పుట్టిస్తోంది.
రూల్సు.. వారు అతిక్రమించడం కోసమే ఉంటాయి!
Wednesday, January 15, 2025